జగన్ సర్కారుకు బిగ్ షాక్

సీఆర్ డీఏ చట్టం ప్రకారం ముందుకు సాగాల్సిందే
అమరావతి భూములు రాజధాని అవసరాలకే
అక్కడి నుంచి ఏ కార్యాలయాన్ని తరలించొద్దు
అమరావతి వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చింది. మూడు రాజధానుల బిల్లులను ఉపసంహరించుకున్నందున తమ ప్లాన్ వర్కవుట్ అవుతుందని భావించిన జగన్ సర్కారుకు ఊహించని షాక్ తగిలింది. సీఆర్ డీఏ చట్టం ప్రకారమే ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ ను పూర్తి చేయాలని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా సారధ్యంలోని బెంచ్ ఈ ఆదేశాలు వెలువరించింది. రాజధాని అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు తమకు నివేదికలు సమర్పించాలని తెలిపింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు మూడు నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పర్చిన ఫ్లాట్లను అప్పగించాలని ఆదేశించింది. అదే సమయంలో రాజధాని అవసరాలకు తప్ప అమరావతి భూములను ఇతర అవసరాలకు మళ్ళించకూడదని స్పష్టం చేసింది. రాజధానికి సంబంధించి దాఖలైన మొత్తం 70కిపైగా పిటిషన్లపై గురువారం ఉదయం త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది.
పిటిషనర్లు అందరికీ ఖర్చుల కింద 50వేల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. కొంతమంది న్యాయమూర్తులు ఈ కేసులు విచారించొద్దన్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదన్నారు. మూడు రాజధానుల బిల్లులను ప్రభుత్వం ఉపసంహరించుకున్నా కూడా తమకు సంబంధించిన అంశాలు పలు అంతే ఉన్నాయని రైతులతోపాటు పలువురు హైకోర్టు ముందు వాదనలు విన్పించారు. ప్రభుత్వమే చట్టాలు ఉపసంహరించుకున్నందున రైతులతోపాటు రాజధానిపై దాఖలైన పిటీషన్లకు అసలు ఎలాంటి ప్రాముఖ్యత లేకుండా పోయిందని ప్రభుత్వం వాదించింది. మొత్తం 75 కేసుల్లో హైకోర్టు వేర్వేరుగా తీర్పు వెలువరించింది.