జగన్ లెక్క తప్పుతోంది
వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లెక్క తప్పుతోంది. ఎన్నికలు ఏవైనా గెలుపు మాదే అంటూ నిన్న మొన్నటి వరకు ధీమా చూపించిన వైసీపీ అధినేతకు వరస షాక్ లు తగులుతున్నాయి. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు గ్రాడ్యుయేట్ సీట్లకు మూడూ తెలుగు దేశం పార్టీ గెలుచుకుని అధికార వైసీపీ కి షాక్ ఇచ్చింది. ఈ షాక్ నుంచి ఇంకా తేరుకోక ముందే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మరో షాక్ తగలటం అధికార వైసీపీ కి ఊహించని పరిణామమే. ఎన్నికల ముందు వరుస మీటింగ్ లు పెట్టి...ఎమ్మెల్యేలను బుజ్జగించి...ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ ప్లాన్స్ వర్క్ అవుట్ కాలేదు. ఎన్నికల ఏడాది లో ఈ పరిణామాలు పార్టీ కి ఏ మాత్రం మంచివి కావు అనే అభిప్రాయం వైసీపీ నేతల్లో ఉంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క అభ్యర్థి గెలుపు కావాల్సిన ఓట్లు 22 . తెలుగు దేశం పార్టీ గత ఎన్నికల్లో 23 సీట్లు గెలుచుకుంది. కానీ టీడీపీ లో గెలిచిన వాళ్ళు నలుగురు వైసీపీ క్యాంపులోకి వెళ్లారు. జగన్ గత ఎన్నికల్లో 151 సీట్ల తో గెలిచి అసెంబ్లీలో చాలా చాలా మాటలు చెప్పారు. ఎవరైనా అసలు పార్టీ మారితే వెంటనే వారి సభ్యత్వం రద్దు అయిపోవాలి అంటూ అసెంబ్లీ సాక్షిగా జగన్ ప్రకటించారు. సీన్ కట్ చేస్తే అయన అసెంబ్లీలో చెప్పిన దానికి బిన్నంగా టీడీపీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకున్నారు.
వాళ్ళతో పలు సందర్భాల్లో టీడీపీపై విమర్శలు చేయించారు. అంటే గతంలో చంద్రబాబు చేసిన దానికి...ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి చేసిన దానికి మధ్య పెద్ద తేడా ఏముంది అన్న చర్చ తెరపైకి రావటం సహజమే. తనకు అవసరం అయినప్పుడు తప్ప ఎమ్మెల్యే కు వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి సమయం ఇవ్వకపోవటం ...వారి వినతులు వినే పరిస్థితి లేక పోవటంతో చాలా మంది ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. జగన్ అవసరం ఉన్నప్పుడు వాళ్ళను పిలవటం తప్ప...వాళ్ళ అవసరం ఉన్నప్పుడు పలికే వాళ్ళు లేకపోవటం చాలా మందికి పెద్ద సమస్యగా ఉంది. టీడీపీ బలం లేక పోయినా అభ్యర్థిని బరిలోకి దింపింది అనే వాదన ఏ మాత్రం పస ఉన్న వాదన కాదు. ఎందుకంటే ఆ పార్టీ గెలిచింది 23 సీట్లు...విప్ జారీ చేసి ప్రయత్నం చేయటాన్ని ఏ మాత్రం తప్పు పట్టలేము. మొత్తానికి జగన్ కు వరసగా ఒకే నెలలో రెండు షాక్ లు తగలటం అన్నది ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకం కానుంది. తెలుగు దేశం పార్టీ చివరి నిమిషంలో పంచుమర్తి అనురాధ ను బరిలోకి దింపి అనూహ్య స్థాయిలో విజయం సాధించటం అన్నది టీడీపీ లో కొంత జోష్ తెచ్చే అంశమే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లు అన్ని అంటే ఏడూ తామే గెలుస్తాము అనే ధీమా చూపిన అధికార పార్టీ కి మాత్రం ఇది బిగ్ షాక్ అని చెప్పుకోవాలి.