Telugu Gateway
Andhra Pradesh

స్కిల్ స్కాం:టీడీపీ లెక్క తప్పింది!

స్కిల్ స్కాం:టీడీపీ లెక్క తప్పింది!
X

తెలుగు దేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇది ఊహించని పరిణామం. స్కిల్ డెవలప్ మెంట్ కేసు లో ఏసీబీ కోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసు లో చంద్రబాబు తరపున బలంగా వాదనలు వినిపించేందుకు ఢిల్లీ నుంచి ఏకంగా సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూద్రా ను రంగంలోకి దింపిన ఉపయోగం లేకుండా పోయింది. తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు అందరూ కోర్ట్ తీర్పు తమకు అనుకూలంగా వస్తుంది అని ధీమా వ్యక్తం చేసినా...ఏసీబీ కోర్టు తీర్పు అందుకు బిన్నంగా వచ్చింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో సిఐడి వాదనలతో ఏకీభవించిన కోర్టు చంద్రబాబు ను 14 రోజుల రిమాండ్ కు పంపిస్తూ ఆదేశాలు చేశారు. చంద్రబాబు తరపున సిద్దార్ధ లూద్రా వాదనలు వినిపిస్తే సిఐడి తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. కోర్టు తీర్పుతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించనున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో చంద్రబాబు పాత్ర చాలా లోతుగా ఉంది అని...ఈ విషయంలో ఆయన్ను కస్టడీ కి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉంది అని ఇప్పటికే సిఐడి అధికారులు చెపుతూ వస్తున్న విషయం తెలిసిందే.

ఏసీబీ కోర్టు తీర్పు తర్వాత సిఐడి కస్టడీకి కోరే అవకాశం ఉంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో పక్కా ఆధారాలతోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్ చేశామని సీఐడీ చెపుతోంది. 279 కోట్ల స్కామ్‌ జరిగిందని, అందులో చంద్రబాబు పాత్ర ఉందని పేర్కొంది. రిమాండ్ ను తిరస్కరించాలని...కేవలం రాజకీయ కోణంలోనే చంద్రబాబు ను వేధిస్తున్నారు అంటూ సిద్దార్ధ లూద్రా చేసిన వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. అవినీతి కేసు లో తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావటం ఒకెత్తు అయితే...ఇప్పుడు అయన జైలు కు కూడా వెళ్లనున్నారు. కోర్టు తీర్పు తో టీడీపీ లో నిరాశ నెలకొనగా..అధికార వైసీపీ మాత్రం సంబరాలు చేసుకుంటోంది. టీడీపీ మాత్రం అరెస్ట్ కు నిరసనగా సోమవారం నాడు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది.

Next Story
Share it