ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి షాక్
ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు లో ప్రభుత్వానికి మరో సారి షాక్ తగిలింది. తిరుమల తిరుపతి దేవస్థానము లో భారీ ఎత్తున నియమించిన ప్రత్యేక ఆహ్వానితుల ప్రభుత్వ ఆదేశాలను హై కోర్ట్ తాత్కాలింగా పక్కన పెట్టింది. దీనితో ఈ జాబితాలో పేర్లు ఉన్నవారు నిరాశకు గురయ్యారు . గతంలో ఎప్పుడు లేని విధముగా ఈ సారి ఏకంగా 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. అప్పుడే దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా సరే ప్రభుత్వం తాను అనుకున్నట్లుగానే ముందుకు వెళ్ళింది. ఇప్పుడు కోర్టులో చుక్కెదురు తప్పలేదు. బుధవారం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రత్యేక ఆహ్వానితుల కోసం జారీచేసిన జీవోను సస్పెండ్ చేసింది.
తితిదే బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించారని పిటిషనర్ వాదనలు విన్పించారు. దీనివల్ల సామాన్య భక్తులపై భారం పడుతుందని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. ప్రభుత్వం మాత్రం నిబంధనల ప్రకారం నియామకాలు చేశామని కోర్టుకి తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్ట్ తదుపరి విచారణనను నాలుగు వారాలకు వాయిదా వేసింది .