Telugu Gateway
Andhra Pradesh

సన్నిహితులనూ దూరం చేసుకుంటున్న జగన్ !

సన్నిహితులనూ దూరం చేసుకుంటున్న జగన్ !
X

ఏ పార్టీ నాయకుడు అయినా ముందు తన సన్నిహితులను కాపాడు కుంటారు. ఎందుకంటే నమ్మకస్తులు ఏ నాయకుడికి అయినా అవసరం. కష్టాల్లో..నష్టాల్లో కూడా తోడు ఉండేది వాళ్లే. లేకపోతే సొంత మనుషులను కూడా పట్టించుకోని వ్యక్తి మనల్ని ఎందుకు పట్టించుకుంటాడు అనే అనుమమానం ఎవరిలో అయినా రావటం సహజమే. వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. అయన తీరు ఇప్పుడు ఆ పార్టీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. సరిగ్గా ఎన్నికల ముందు జరుగుతున్న పరిణామాలు పార్టీకి నష్టం చేస్తాయి తప్ప..ఏ మాత్రం లాభం చేసేవి కావు అనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. అదే సమయంలో జగన్, రాజశేఖర్ రెడ్డి తీరుపై కూడా పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. దివంగత రాజశేఖర్ రెడ్డి అయితే తప్పు చేసినా సరే తప్పని తెలిసినా తన వాళ్ళ కోసం నిలబడే వాడు అని..కానీ జగన్ మాత్రం అందుకు బిన్నంగా చేస్తున్నారు అంటూ ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు వాళ్ళు పలు అంశాలను ఉదహరిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా జగన్ కోసం ఏమి చేయటానికి అయినా సిద్ధంగా ఉన్న వాళ్లలో ఆళ్ల రామకృష్ణ రెడ్డి తో పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి వాళ్ళు ముందు వరసలో ఉండేవాళ్ళు. కోటంరెడ్డి ఇప్పటికే పార్టీ ని వీడారు. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణ రెడ్డి వంతు వచ్చింది. జగన్ కుటుంబానికి సన్నిహితుడు, బంధువు కూడా అయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా ఇప్పుడు వైసీపీ లో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు..తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు అన్ని వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉంది అనే భయం పార్టీ నేతల్లో ఉంది.

సోమవారం నాడు వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్. గత ఎన్నికల్లో టీడీపీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు, మంత్రిగా ఉన్న నారా లోకేష్ ను ఓడించి అందరి దృష్టిని ఆకర్షించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి వైసీపీ కి గుడ్ బై చెప్పారు. అంతే కాదు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. గత కొంత కాలంగా ఆళ్ల రామకృష్ణ రెడ్డి అధికార వైసీపీలో ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల సందర్భంగా ప్రచార సభలో గెలిస్తే ఆళ్ల రామకృష్ణ రెడ్డి కి మంత్రి పదవి ఇస్తానని జగన్ ప్రకటించారు. కానీ అయన మాట నిలుపుకోలేదు కదా....కనీసం పిలిచి మాట్లాడింది లేదు..పోనీ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో గుర్తింపు ఉన్న నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వలేదు. పైగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు హామీలు మాత్రం ఇచ్చి..నిధుల విడుదల విషయంలో సీఎంఓ చుట్టూ తిప్పుతున్న తీరు చూసి విసుగొచ్చి అయన రాజీనామా చేసినట్లు ఆళ్ల సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి .అంతే కాకుండా నియోజకవర్గంలో చేపట్టిన పార్టీ నియామకాల విషయంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల కు మాట మాత్రం కూడా చెప్పకుండా పార్టీనే అన్ని చేసుకుంటూ పోతోంది. ఇవన్నీ కలిసి ఆళ్ల రామకృష్ణ రెడ్డి పార్టీని వీడేలా చేశాయని చెపుతున్నారు. ఏది ఏమైనా ఎన్నికల ముందు చోటు చేసుకున్న ఈ పరిణామం వైసీపీ కి పెద్ద దెబ్బగా చెప్పొచ్చు.


Next Story
Share it