స్టాంప్ సైజు లో సీఎం..మంత్రి ఫోటోలు..ఆంధ్ర జ్యోతి ఎండీ ఫోటో పెద్దగా!

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శాఖలకు కూడా అభిమాన పత్రికలు ఉంటాయా?. బుధవారం నాడు ఆంధ్ర జ్యోతి పత్రికలో వచ్చిన ఒక యాడ్ ఇప్పుడు అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ యాడ్ చూసిన ఐఏఎస్ అధికారులు కూడా అవాక్కు అవుతున్నారు. ప్రభుత్వ శాఖ తరపున అధికారికంగా ప్రభుత్వ లోగో...శాఖ పేరు వాడి మరీ ఇచ్చిన ఈ ప్రకటనలో ఆంధ్ర జ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ ఫోటో పెద్దగా పెట్టి ..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ల ఫోటో లు స్టాంప్ సైజు లో పెట్టి ఈ యాడ్ ప్రచురించారు. ఈ ప్రకటన ఇచ్చింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ అని అధికారికంగా ప్రస్తావించారు. ఆంధ్ర జ్యోతి సంస్థల వార్షికోత్సవం సందర్భంగా యాడ్ ఇవ్వటం తప్పేమి కాకపోయినా...ఇచ్చిన పద్ధతి...ఆ యాడ్ లో సీఎం, మంత్రుల ఫోటో లను ఆ శాఖ పేరు లాగా స్టాంప్ సైజు లో పెట్టారు.
మరో వైపు ఆంధ్ర జ్యోతి ఎండీ రాధాకృష్ణ ఫోటో చాలా పెద్దగా పెట్టడం ద్వారా అసలు దీని ద్వారా ఏమి చెప్పాలనుకున్నారో అర్ధం కావటం లేదు ఒక ఐఏఎస్ అధికారి విస్మయం వ్యక్తం చేశారు. అంతే కాదు రాధాకృష్ణ ఫోటో పెట్టి దానిపక్కన రిజిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ గురించి రాసుకొచ్చారు. పార్టీలకు...ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండే పత్రికల విషయంలో ఆయా పార్టీలు..ప్రభుత్వాలు కూడా అంతే సానుకూలంగా వ్యవహరిస్తాయి. ముఖ్యంగా ఇది ప్రకటనల రూపంలో ...ఇతర రూపాల్లో వ్యక్తం అవుతూ ఉంటుంది. కానీ ఏకంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఇచ్చిన యాడ్ లో అభిమాన ఆంధ్ర జ్యోతికి 23 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు. విచిత్రం ఏమిటి అంటే ఆ యాడ్ లో ఒక పక్కన ల్యాండ్ ముక్కను కేక్ లాగా కట్ చేసి పెట్టారు.
ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల నుంచి ప్రభుత్వ ప్రకటనల్లో జారీ చేసిన వారు సమాచార శాఖ అనే ప్రస్తావన కూడా ఎత్తేశారు. గతంలో ఏ శాఖ అయినా విడిగా ప్రకటన ఇస్తే ఆ శాఖ పేరు లేదా ఎక్కువ శాతం అన్ని శాఖల తరపున సమాచార శాఖ మాత్రమే యాడ్స్ జారీ చేసేది. ఇప్పుడు ఆ విధానానికి కూడా స్వస్తి పలికినట్లు ఉంది అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. ఆంధ్ర జ్యోతి కి యాడ్ ఇవ్వటాన్ని ఎవరూ తప్పుపట్టారు. కానీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ యాడ్ ఇచ్చిన తీరు మాత్రం దారుణాతి దారుణంగా ఉంది అని...ఇది ప్రభుత్వ పరువు తీసేలా ఉంది అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.



