వెంటనే విడుదల చేయండి

సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు కు సుప్రీం కోర్ట్ లో ఊరట లభించింది. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. కొద్ది రోజుల క్రితం సాక్షి ఛానెల్ లో నిర్వహించిన డిబేట్ లో అమరావతి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు అనే కారణంతో కొమ్మినేని శ్రీనివాస రావు ను ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ లు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరో జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతి పై అనుచిత వ్యాఖ్యలు చేయగా..తొలుత వాటిని తప్పుపట్టిన కొమ్మినేని శ్రీనివాస రావు తర్వాత ఇలా అంటే టీడీపీ వాళ్ళు మిమ్మల్ని సోషల్ మీడియా లో ట్రోల్ చేస్తారేమో అంటూ మాట్లాడటం దుమారం రేపింది.
ఈ కేసు లో తొలుత కొమ్మినేని శ్రీనివాస రావు ను...తర్వాత కృష్ణం రాజు ను ఏపీ పోలీస్ లు అరెస్ట్ చేశారు. సుప్రీం కోర్టు లో కొమ్మినేని శ్రీనివాస రావు దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ పీ కె మిశ్ర, జస్టిస్ మన్మోహన్ లతో కూడిన ధర్మాసనం విచారించింది. ప్యానలిస్ట్ చేసిన కామెంట్స్ పై కొమ్మినేని శ్రీనివాస రావు పై కేసు ఎలా పెడతారు అని బెంచ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిని ప్రశ్నించింది. అదే సమయంలో డిబేట్స్ ను గౌరవ ప్రదంగా నిర్వహించాలని కోర్టు వ్యాఖ్యానించింది. కొమ్మినేని విడుదల సందర్భంగా అవసరమైన షరతులను ట్రయల్ కోర్టు విడుస్తుంది అని సుప్రీం కోర్టు వెల్లడించింది.