పది వేల మందికి ఉద్యోగాలు
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ కు ఇది బిగ్ న్యూస్. దిగ్గజ ఐటి కంపెనీ టిసిఎస్ వైజాగ్ కేంద్రంగా తన క్యాంపస్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఏకంగా పదివేల మందికి ఉపాధి కల్పించేలా ఇది ఉంటుంది అని ఆంధ్ర ప్రదేశ్ ఐటి శాఖ నారా లోకేష్ వెల్లడించారు. ఆయన తాజాగా ముంబై వెళ్లి టిసిఎస్ చైర్మన్ చంద్రశేఖరన్ తో సమావేశం అయి వచ్చారు. ఆ తర్వాత బుధవారం నాడు కీలక ప్రకటన ఉంటుంది అని తెలిపారు. చెప్పిన తరహాలోనే వైజాగ్ లో టిసిఎస్ తన ఫెసిలిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది అని వెల్లడించారు. వైజాగ్ లో టాటా గ్రూప్ తన ఐటి కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించటం పై లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు.
స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా రాష్ట్రంలో అత్యుత్తమ పెట్టుబడుల వాతావరణం ఏర్పాటు చేయటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వైజాగ్ కు టిసిఎస్ రానుండటం ఆంధ్ర ప్రదేశ్ కు ఎంతో కీలకం కానుంది అన్నారు. లులు గ్రూప్ ప్రతినిధులు కూడా ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో భేటీ అయి రాష్ట్రంలో పలు చోట్ల పెట్టుబడి పెడతామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో వైజాగ్ లో భారీ మాల్ ప్రతిపాదన కూడా ఉంది. వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా వైజాగ్ లో ఐటి రంగం అభివృద్ధికి పలు చర్యలు తీసుకున్నా ఆశించిన స్థాయిలో అక్కడ ఈ రంగం ప్రగతి సాధించలేకపోయింది అని చెప్పొచ్చు. ఇప్పుడు టిసిఎస్ రాకతో అయినా రాబోయో రోజుల్లో పరిస్థితిలో ఏమైనా మార్పు వస్తుందేమో చూడాలి.