Telugu Gateway
Andhra Pradesh

యాడ్ లోనూ పవన్ కు సమానంగా నారా లోకేష్ కు ప్రాధాన్యత

యాడ్ లోనూ పవన్ కు సమానంగా నారా లోకేష్ కు ప్రాధాన్యత
X

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు తన కొడుకు, మంత్రి నారా లోకేష్ ను మాత్రం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారు. కేబినెట్ సమావేశాల్లోనూ ఉప ముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్ ఒక వైపు ... మరో వైపు పవన్ కళ్యాణ్ కు ఎదురుగా ఏ మాత్రం తేడా రాకుండా నారా లోకేష్ కు సీటు వేస్తారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న వ్యవహారమే. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి పనులు శుక్రవారం నాడు ప్రధాని మోడీ చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని ప్రధాన పత్రికల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చింది. ఇందులో ఒక వైపు ప్రధాని నరేంద్ర మోడీ, మరో వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోలు ఉన్నాయి. ఈ యాడ్ టాప్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు ఏపీ ఐటి, మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఫోటో కూడా వేశారు. అంటే ఉప ముఖ్యమంత్రి కాకపోయినా...ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సమానంగా నారా లోకేష్ ను ట్రీట్ చేశారు. ఒక్క మాటలతో చెప్పాలంటే అసలు ఉప ముఖ్యమంత్రి అనేది ఒక హోదా తప్ప...దానికి కూడా మంత్రి ప్రొటొకాల్స్ మాత్రమే ఉంటాయి తప్ప ప్రత్యేక హక్కులు ఏమీ ఉండవు. ఇక నారా లోకేష్ విషయానికి వస్తే ఆయన కేబినెట్ మంత్రి.

మంత్రి హోదాలో ఉన్న నారా లోకేష్ ఫోటో వేసి...ఏ శాఖ అయితే రాజధాని అమరావతి పనులు చేస్తుందో...గత కొన్ని రోజులుగా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ నిత్యం అమరావతి పనుల పునః ప్రారంభానికి కృషి చేసిన మంత్రి నారాయణ ఫోటో మాత్రం ఈ యాడ్ లో కనిపించలేదు. మంత్రి నారా లోకేష్ ఫోటో వేసి దగ్గరుండి పనులు చూస్తున్న మంత్రి నారాయణను విస్మరించటం అంటే ఇది ఆయన్ను అవమానించటమే అనే చర్చ సాగుతోంది. సీఎం చంద్రబాబుకు...మంత్రి నారాయణకు ఉన్న సంబంధాల కారణంగా ఆయన ఏమి ఫీల్ అవుతారో తెలియదు కానీ ఈ కీలక సమయంలో వేసిన యాడ్ లో మంత్రి నారా లోకేష్ ఫోటో వేసి నారాయణను విస్మరించటం ఖచ్చితంగా ఆయన్ను అవమానించటమే అన్న చర్చ అధికార వర్గాల్లో కూడా ఉంది. జగన్ మోహన్ రెడ్డి హయాంలో చేసిన చందంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రభుత్వం అంటే తాను, తన కుమారుడు లోకేష్, పవన్ కళ్యాణ్ లు మాత్రమే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి.

Next Story
Share it