ఆగస్ట్ 17 నుంచి సర్వీసులు మొదలు

ఆంధ్ర ప్రదేశ్ విమానయాన చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. రాష్ట్రంలో తొలి గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం నాడు ప్రారంభించారు. విజయనగరం జిల్లా భోగాపురం లో జీఎంఆర్ సంస్థ పీపీపీ విధానంలో ఈ ఎయిర్ పోర్ట్ ను అభివృద్ధి చేసింది. 2700 ఎకరాల్లో ఏటా అరవై లక్షల మంది రాకపోకలు సాగించేందుకు వీలుగా ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. గరిష్టంగా ఈ విమానాశ్రయంలో ప్రయాణికుల సామర్ధ్యాన్ని నాలుగు కోట్ల మంది రాకపోకలు సాగించేలా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. తొలి దశ ప్రాజెక్ట్ ను 4750 కోట్ల రూపాయలతో చేపట్టారు. అత్యాధునిక హంగులతో కూడిన ఈ భోగాపురం ఎయిర్ పోర్ట్ ఆగస్ట్ 17 అర్ధరాత్రి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీ వెంట ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర ఏపీ మంత్రులు ఉన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవనంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద వీడియో వాల్‌ను ప్రధాని పరిశీలించారు.ఈ వీడియో వాల్‌లో ప్రదర్శించిన వివిధ పుణ్యక్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర చరిత్రాక అంశాలను ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
విమానాశ్రయ ప్రాంగణంలోని వివిధ కళాకృతులను మోదీ పరిశీలించారు. ప్రధాని మోడీ ఓపెన్ టాప్ జీపులో వెళ్తూ 13,500 మంది గిరిజన మహిళలు ప్రదర్శించిన థింసా నృత్యాన్నితిలకించారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవంతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం 18 వేల కోట్ల రూపాయల వివిధ ప్రాజెక్టులకు మోడీ శ్రీకారం చుట్టారు. తమ ప్రభుత్వం దేశంలో కొత్తగా చాలా నూతన విమానాశ్రయాలతో పాటు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది అని తెలిపారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్ వే లాగా ఉపయోగపడుతుంది అని వ్యాఖ్యానించారు. 2014 కు ముందు దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు ఉంటే... తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంఖ్య 166 కి చేరింది అన్నారు. ఉడాన్ స్కీమ్ ద్వారా దేశ విమానయాన రంగంలో ఎన్నో మార్పులు చేశామని..పేద, మధ్యతరగతి ప్రజలకు కూడా ఇప్పుడు విమానయాన అందుబాటులోకి వచ్చింది అని తెలిపారు.



