Telugu Gateway
Andhra Pradesh

భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవంలో పీక్ కు చేరిన మోడీ భజన !

భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవంలో పీక్ కు చేరిన మోడీ భజన !
X

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై సోషల్ మీడియా లో తీవ్ర విమర్శలు

దేశంలో అయినా..రాష్ట్రంలో అయినా అధికారాన్ని మార్చే శక్తి ఒక్క ప్రజలకు...వాళ్ళు వేసే ఓట్లకే ఉంటుంది. ఎవరిని అధికారంలో ఉంచాలి..ఎవరిని పదవుల నుంచి దించాలి అన్నది డిసైడ్ చేసేది ప్రజలే. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం శనివారం నాడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సమయంలో విచిత్ర..వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మిమ్మల్ని రాజకీయంగా ఓడించే నాయకుడు ఈ భారతదేశంలో లేడు... రాబోడు. దేశం కోసం మీరు పడిన శ్రమ, చేసిన త్యాగం, చూపించిన అంకితభావానికి సాటి ఎవరూ లేరు....‘మీరు స్వయంగా వద్దనుకుంటేనే అధికారం మీ చేతుల నుంచి వెళ్తుంది... కానీ మీరు దేశం కోసం పనిచేసేంత వరకు, మేమంతా మీ వెంటే ఉంటాం. దేశం కోసం మీరు పడిన శ్రమ, చేసిన త్యాగం, చూపించిన అంకితభావానికి సాటి ఎవరూ లేరు.’ అని చెప్పుకొచ్చారు.

టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎవరికి మద్దతు ఇవ్వాలన్నది పూర్తిగా వాళ్ళ ఇష్టమే. కానీ ఎవరినైనా...అది రాష్ట్రంలో అయినా..దేశంలో అయినా ప్రజలు వద్దు అనుకుంటే వాళ్ళ అధికారం పోతుంది. కానీ ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రం మోడీ స్వయంగా వద్దు అనుకుంటే అధికారం మీ చేతుల నుంచి వెళుతుంది అని చెప్పటం వెనక ఉద్దేశం ఏంటి?. అసలు ఏ రాజకీయ నాయకుడు అయినా సరే తనకు అధికారం వద్దు అని అనుకుంటారా?. పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యల ద్వారా ప్రజలకు ఎలాంటి సంకేతం పంపదల్చుకున్నారు? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు కలిగించేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. జంతర్ మంతర్ దగ్గర ప్రధాని మోడీ ని యువత తిట్టినప్పుడు తనకు కన్నీళ్లు వచ్చాయని..గుండె బరువెక్కింది అని పవన్ కళ్యాణ్ ఇదే సమావేశంలో చెప్పారు. నీట్ పేపర్ లీక్ అయి పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పడు హృదయం బరువు ఎక్కని..కన్నీళ్లు రాని పవన్ కళ్యాణ్ కు మోడీ ని తిట్టినందునే మాత్రమే కన్నీళ్లు వచ్చాయి అని చెప్పటం అంటే పవన్ కళ్యాణ్ పూర్తిగా బాధితుల పక్షం వైపు కాకుండా...పేపర్ లీక్ కు కారణం అయిన ప్రభుత్వం పక్షానే వాదనకు దిగారు.

అదే జంతరమంతర్ లో ధర్నా చేస్తున్న వాళ్లపై పోలీస్ ల దాడి పై మాత్రం అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ఇద్దరూ మౌనాన్నే ఆశ్రయించారు. విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో ఇద్దరిది అదే దారి. నిజంగా నీట్ పరీక్ష విషయంలో మోడీ సర్కారు ఏ తప్పు చేయకపోయి ఉంటే కేంద్ర మంత్రి తో ఎందుకు రాజీనామా చేయించుతారు అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ మాత్రం తప్పు ఒక్క యువత వైపే ఉన్నట్లు మాట్లాడుతున్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవంలో అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ ల స్పీచ్ లు చూసిన తర్వాత సోషల్ మీడియా లో వీళ్ళ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అటు టీడీపీ, ఇటు జనసేన కు చెందిన వాళ్ళు కూడా భోగాపురం లో భజన కొంత శృతి మించింది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఒక వైపు దేశ వ్యాప్తంగా ప్రధాని మోడీకి విపరీతంగా వ్యతిరేకత పెరుగుతుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతున్న వేళ ఏపీలో కీలక నేతలు భారీ ఎత్తున ప్రధాని పై పొగడ్తల వర్షం కురిపించటంతో ఇది ఎటు వైపు మళ్లుతుందో అన్న ఆందోళన ఆయా పార్టీల నేతల్లో వ్యక్తం అవుతోంది. ఏపీ విషయానికి వచ్చేటప్పటికి విచిత్రం ఏమిటి ఎన్డీయే లో భాగస్వాములుగా ఉంది టీడీపీ, జనసేన మోడీని పొగుడుతుంటే...ప్రతిపక్ష వైసీపీ కూడా వీళ్ళ కంటే ఎక్కువే మోడీ కి మద్దతుగా నిలవటం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై భాగస్వామ్య పక్షాలు టీడీపీ, జనసేన నోరెత్తలేదు. కానీ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడాన్నిస్వాగతిస్తున్నట్లు ప్రకటించారు.

Next Story
Share it