Telugu Gateway
Andhra Pradesh

మళ్ళీ వివాదాలు తప్పవా!

మళ్ళీ వివాదాలు తప్పవా!
X

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్ని విమర్శలు వస్తున్నా కూడా బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేలా ఉన్నట్లు కనిపించటం లేదు. ఈ ప్రాజెక్ట్ పై ఏకంగా 80000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టె బదులు ...రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అని ఈ రంగంలోని నిపుణులు చెపుతున్నా కూడా చంద్రబాబు సర్కారు మాత్రం అయితే 80 వేల కోట్ల రూపాయల బనకచెర్ల ప్రాజెక్ట్ లేదంటే అరవై వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మరో కొత్త ప్రాజెక్ట్ ను తెర మీదకు తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల శాఖ పోలవరం-బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ (పీబిఎల్ పీ) సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) తయారీ కోసం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర జలసంఘం మార్గదర్శకాల ప్రకారం డీపీఆర్ తయారీతో పాటు ఈ ప్రాజెక్ట్ చేపట్టేందుకు అవసరమైన పరిశోధనలు చేయటం..భారత ప్రభుత్వం నుంచి అన్ని చట్టపరమైన అనుమతులు పొందేందుకు వీలుగా నివేదికలు సిద్ధం చేయాలన్నారు.

ఈ పనులను 9 .20 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేయాల్సి ఉంటుంది అని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ తో బనకచెర్ల ప్రాజెక్ట్ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు అనే విషయం స్పష్టం అయింది అని చెప్పొచ్చు. ఇది అంతా కూడా ఒక కాంట్రాక్టర్ కోసం డిజైన్ చేశారు అనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ కాంట్రాక్టర్ కు ప్రాజెక్ట్ అప్పగించి అందుకు అనుగుణంగా పెద్ద ఎత్తున ప్రయోజనం పొందేందుకే దీన్ని తెర మీదకు తెచ్చినట్లు ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ వ్యవహారం కొద్ది రోజుల క్రితం వరకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ నాయకుల మధ్య పెద్ద ఎత్తున విమర్శలకు కూడా కారణం అయింది. తర్వాత సడన్ గా ఈ వ్యవహారం పక్కకు పోయింది. ఇప్పుడు మళ్ళీ డీపీఆర్ తయారీకి నోటిఫికేషన్ జారీ చేయటంతో మరో సారి బనకచెర్ల ప్రాజెక్ట్ వార్తల్లోకి వచ్చింది.

వాస్తవానికి ఎవరైతే ఈ ప్రాజెక్ట్ కోసం తెర వెనక కథ నడిపిస్తున్నారో వాళ్లే ఇప్పటికే డీపీఆర్ కూడా రెడీ చేశారు అని..ఇది అంతా కూడా ఒక పద్దతిలో వెళుతున్నట్లు చూపించుకోవటం కోసమే డీపీఆర్ నోటిఫికేషన్ అని సాగునీటి శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్ల ప్లేస్ లో పోలవరం -సోమశిల అనుసంధానం ప్రాజెక్ట్ ను తెరపైకి తీసుకొస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ ను 58 వేల కోట్ల రూపాయలతో పూర్తి చేసే అవకాశం ఉండటంతో ఈ కొత్త ప్రతిపాదన వచ్చినట్లు అందులో పేర్కొన్నారు. కానీ చంద్రబాబు సర్కారు మాత్రం తాము అనుకున్న బనకచెర్ల ప్రాజెక్ట్ తోనే ముందుకు వెళ్ళటానికి నిర్ణయం తీసుకున్నట్లు తాజా నోటిఫికేషన్ స్పష్టం చేస్తోంది.

Next Story
Share it