Telugu Gateway
Andhra Pradesh

డిజైన్...డీపీఆర్..తెర వెనక కథ అంతా ఆ బడా కాంట్రాక్టర్ దే!

డిజైన్...డీపీఆర్..తెర వెనక  కథ అంతా ఆ బడా కాంట్రాక్టర్ దే!
X

నిధుల వ్యవహారంలో కూడా చక్రం తిప్పుతున్న ఆ కాంట్రాక్టర్!

ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి బనకచర్ల ప్రాజెక్ట్ కడితే కొత్తగా అందుబాటులోకి వచ్చే ఆయకట్టు ఏడున్నర లక్షల ఎకరాలు. 80 లక్షల మందికి తాగు నీరు అందుతుంది. పైగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయటానికి 48 వేల ఎకరాల భూసేకరణ అవసరం. ఇవన్నీ కూడా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కలే. అయితే ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల శాఖ నివేదిక ప్రకారం రాష్ట్రంలో మొత్తం 86 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిపై ఇప్పటికే 56961 కోట్ల రూపాయల వ్యయం చేశారు. ఈ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ లపై మరో 1 ,16 ,405 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే కొత్తగా 37 . 51 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుంది. అదే సమయంలో మరో 48 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది అని జలవనరుల శాఖ లెక్కలే చెపుతున్నాయి.

ఎలా చూసుకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెపుతున్నట్లు బనకచర్ల ప్రాజెక్ట్ టేకప్ చేయటం కంటే కూడా పెండింగ్ ప్రాజెక్ట్ లు పూర్తి చేయటం వల్లే రాష్ట్రానికి ఎక్కువ మేలు జరుగుతుంది అనేది ఈ రంగంలోని నిపుణులు చెపుతున్న మాట. లెక్కలు కూడా అదే చెపుతున్నాయి. అయితే ఇక్కడ అసలు కీలక విషయం ఏమిటి అంటే పాత ప్రాజెక్ట్ లను చేపడితే ప్రభుత్వంలోని పెద్దలకు ఎలాంటి ఉపయోగం ఉండదు. అదే కొత్త ప్రాజెక్ట్ ను డిజైన్ చేసి..కొత్తగా కాంట్రాక్టు లు ఇస్తే వచ్చే లాభం ఒక రేంజ్ లో ఉంటుంది అని...అందుకే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను తెర మీదకు తెచ్చారు అని ఇరిగేషన్ శాఖ వర్గాలు చెపుతున్నాయి. ఇక్కడ సంచలన విషయం ఏమిటి అంటే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి డిజైన్ లు..డీపీఆర్ ల తెరవెనక కూడా ఆ బడా కాంట్రాక్టర్ ఉన్నారు అని అధికార వర్గాలు చెపుతున్నాయి. మరో విచిత్రం ఏమిటి అంటే ఈ ప్రాజెక్ట్ కు అవసరమైన ఫండ్స్ విషయంలో కూడా సదరు కాంట్రాక్టర్ కూడా కేంద్రం దగ్గర తన వంతు ప్రయత్నం చేస్తున్నారు అని...ఎందుకంటే పనులు ఓకే అయి...టెండర్లు పిలిచినా కూడా అవి తనకు తప్ప మరెవరికి రావు అన్న ధీమాతో వాళ్లలో ఉండటం వల్లనే ఈ వ్యవహారం అంతా సాగుతోంది అని చెపుతున్నారు.

సదర్ కాంట్రాక్టర్ తో ప్రభుత్వ పెద్దలకు ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలు ఉండటంతో అంతా ఒక ప్లాన్ ప్రకారమే ఈ స్కెచ్ వేశారు అన్నది సాగునీటి శాఖ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. పైగా ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్లకు మాత్రం ఇబ్బంది ఉండదు. పైకి బనకచర్ల ప్రాజెక్ట్ వ్యయం 70 నుంచి 80 వేల కోట్ల రూపాయలు అవుతుంది అని చెపుతున్నా కూడా చూస్తుంటే తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ లాగా ఇది కొండలా పెరిగే అవకాశం లేకపోలేదు అన్నది సాగునీటి అధికారుల మాట. ఒక వైపు జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు అని చెపుతున్న చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కంటే బనకచర్ల ప్రాజెక్ట్ పైనే ఎంతో ఫోకస్ పెట్టారు.

మూడు నెలల్లోనే ఈ ప్రాజెక్ట్ పనులకు టెండర్లు పిలవాలి అనే లక్ష్యంతో పని చేస్తున్నారు అంటే దీని వెనక చాలా పెద్ద స్కెచ్ ఉంది అన్నది స్పష్టం అవుతోంది అని ఇంజినీర్లు బహిరంగంగా చెపుతున్న మాట. ఒక వైపు ఈ ప్రాజెక్ట్ కు దగ్గర దగ్గర 48 వేల ఎకరాల భూసేకరణ అవసరం అని చెపుతూ అవేమి పూర్తి చేయకుండానే టెండర్లు పిలుస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఎందుకు ఈ ప్రాజెక్ట్ విషయంలో ఇంత తొందర చూపిస్తున్నారు అంటే అందుకు తెర వెనక ఉన్న బలమైన కారణాలే అన్నది స్పష్టం అని అధికార వర్గాల నుంచి వస్తున్న సమాచారం.

Next Story
Share it