బద్వేలులో వైసీపీ గెలుపు
కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ఫలితం వచ్చేసింది. అధికార వైసీపీ తన సిట్టింగ్ సీటు ను తిరిగి కైవసం చేసుకుంది. ఇక్కడ గెలుపుపై ఎవరికీ పెద్దగా ఉత్కంఠ, ఆసక్తిలేవనే చెప్పాలి. ఎంతసేపూ మెజారిటీ ఎంత వస్తుందనే లెక్కలు తప్ప..మిగిలిన అంశాల్లో క్లిస్టర్ క్లియర్ గానే ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. చనిపోయిన అభ్యర్ధి కుటుంబ సభ్యులకే వైసీపీ సీటు ఇచ్చినందున తాము పోటీలో ఉండబోమని ప్రకటించారు. జనసేన కూడా ముందు ఇదే తరహా ప్రకటన చేసి..తర్వాత బిజెపి అభ్యర్ధికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. టీడీపీ బరిలో ఉన్నా కూడా మెజారిటీ అటూ ఇటూ అయ్యే ఛాన్స్ ఉండేదేమో కానీ..వైసీపీ గెలుపు పెద్దగా కష్టం అయ్యేదికాదనే అభిప్రాయం ఉంది.
అయితే బరిలో వైసీపీ, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే ఉండటంతో దీనిపై పెద్దగా ఫోకస్ లేకుండా పోయిందనే చెప్పాలి. ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం అయ్యాక తొలి రౌండ్ నుంచి వైసీపీ అభ్యర్ధి దాసరి సుధ ఆధిక్యత చూపిస్తూ దూసుకెళ్ళారు. ఉప ఎన్నిక సందర్భంగా పోలైన ఓట్లలో సగం కంటే ఎక్కువగా ఇప్పటికే వైసీపీకి రావటంతో ఆ పార్టీ గెలుపు ఖరారు అయిపోయింది. అయితే అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. 10 రౌండ్లు ముగిసేసరికి వైసీపీ 85,505 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు అన్ని రౌండ్లలో కలిపి వైసీపీకి 1,06,088 ఓట్లు సాధించగా.. బీజేపీ 20,583, కాంగ్రెస్ 5968 ఓట్లు సాధించింది.