కూటమి పని చేసేది బడాబాబుల కోసమేనా!

ఎన్నికల్లో గెలవటం కోసం ప్రజలకు అడ్డగోలుగా హామీలు ఇస్తారు. వాటిని నమ్మి గెలిపించిన తర్వాత అందులో కొన్ని అమలు చేసి మిగిలిన వాటిని అటకెక్కిస్తారు. ఓట్లు వేసి గెలిపించటమే కాకుండా...అధికారంలోకి రావటానికి కారణం అయిన ప్రజలకు ఇచ్చిన హామీలకు మాత్రం ఎలాంటి చట్టబద్ధతా ఉండదు. ఆ దిశగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎలాంటి ప్రయత్నం కూడా చేయరు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది అని తెలిసి కూడా ఇచ్చిన హామీల అమలు దగ్గరకు వచ్చేటప్పటికి తాము కాబట్టి ఈ మాత్రం చేశాం అని మళ్ళీ గొప్పగా కవరింగ్ లు ఇచ్చుకుంటారు నేతలు. ఎన్నికలకు ముందు మాత్రం తాము అధికారంలోకి వస్తే చాలు సంపద సృష్టించి..అవినీతిని అరికట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తామని నమ్మబలుకుతారు. కానీ ఆ హామీల్లో ఏవో కొన్ని చేసి అదే గొప్పగా చెప్పుకుంటారు. గత కొంత కాలంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ పరంగా ఇచ్చిన హామీలకు చట్టబద్దత కల్పించేందుకు తహతహలాడుతున్నారు. దీని కోసమే ప్రత్యేక చట్టం తెచ్చేందుకు ప్రయత్నం చేస్తునట్లు చెపుతున్నారు. గెలిపించిన ఓటర్లకు ఇచ్చిన హామీలకు ఎలాంటి గ్యారంటీ ఉండదు. వాటిని మాత్రం వీలును బట్టి అమలు చేస్తారు. కానీ పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన హామీలకు మాత్రం గ్యారంటీ ఇస్తారంట. దీని కోసం ఏకంగా చట్టం చేయటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలపెట్టడం విశేషం.
అంతే కాకుండా ఏకంగా కేంద్రానికి కూడా ఇలాంటి చట్టం చేయాలని సిఫారసు చేయటం చూస్తుంటే ఆయనకు రాష్ట్ర ప్రజలపై కంటే కూడా పారిశ్రామికవేత్తలపై ఎంత ప్రత్యేక ప్రేమ ఉందో అర్ధం అవుతోంది. ప్రభుత్వం తాను తీసుకొచ్చిన విధానాలను తానే ఉల్లఘించి మరీ కొంత మంది బడా బడా పారిశ్రామకవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చుకంటూ పోతోంది. అదే మంటే అంతా తమ ఇష్టం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మొత్తం 32.49 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించామని చెపుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులు పెద్ద ఎత్తున సాధించి..ఉపాధి..ఉద్యోగ అవకాశాలు కల్పించటం ఎంతో కీలకమే. ఈ విషయాన్ని ఎవరూ కాదన్నారు. పారిశ్రామికీకరణ జరిగితేనే రాష్ట్రం వేగం గా అభివృద్ధి చెందుతుంది కూడా. కాకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మంత్రి మంత్రి నారా లోకేష్ లు తమ బ్రాండ్ వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పుకుంటూ పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర వనరులను దారుణంగా దోచిపెడుతున్నారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.
చంద్రబాబు, లోకేష్ చెప్పే లెక్కల్లో ఎలా చూసినా కూడా ప్రతిపాదిత పెట్టుబడుల్లో కేవలం 15 నుంచి 20 పెట్టుబడుల ప్రతిపాదనల వల్లే రాష్ట్రానికి ఎంతో కొంత మేలు జరుగుతుంది అని..మిగిలిన 80 శాతం ప్రతిపాదిత పెట్టుబడుల విషయంలో ఆయా కంపెనీలు...పారిశ్రామివేత్తలకు ఎక్కువ మేలు జరుగుతుంది అని అధికారులు చెపుతున్నారు. ఈ 80 శాతం కంపెనీల విషయంలో రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం కంటే...ఆయా కంపెనీలు ...పారిశ్రామికవేత్తలకు ఒనగూరే ప్రయోజనమే చాలా చాలా ఎక్కువ అని ఒక ఐఏఎస్ అధికారి వెల్లడించారు. ఇలాంటి సంస్థల కోసం రాయితీలు..ప్రోత్సహకాల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవటం...రాయితీల చెల్లింపుల కోసం దేశంలో ఎక్కడ లేని రీతిలో ఎస్క్రో అకౌంట్స్ ఓపెన్ చేస్తామని చెపుతుండంతో బడా బాబులపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు చూపిస్తున్న ప్రత్యేక ప్రేమతో వాళ్ళ అసలు ఆసక్తి ఏంటో తేలిపోతున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఎంపిక చేసిన కంపెనీలకు పెద్ద ఎత్తున అనుచిత ప్రయోజనాలు కల్పిస్తూ తెర వెనక అధికారంలో ఉన్న వాళ్ళు లాభం పొందుతున్నారు అని ...ఇది ఎప్పటి నుంచో సాగుతోంది అని మరో ఐఏఎస్ అధికారి వెల్లడించారు. కానీ పైకి మాత్రం రాష్ట్రం కోసం ఎంతో కష్టపడి పెట్టుబడులు సాధిస్తున్నామని..తమను మించిన వాళ్ళు దేశంలో ఎవరూ లేరు అని చెప్పుకుంటున్నారు చంద్రబాబు, నారా లోకేష్ లు. కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పనిలో పనిగా తమ సన్నిహితులకు చెందిన కంపెనీలకు కూడా ప్రయోజనం కలిగేలా చూసుకుంటున్నారు అనే చర్చ అధికార వర్గాల్లో ఉంది. అందుకే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ఆయన పూర్తిగా సమర్థిస్తూ తన పని తాను చేసుకుంటున్నారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కూటమి మొన్నటి ఎన్నికల్లో గెలవటానికి అత్యంత కీలక హామీలు అయిన 18 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు , నిరుద్యోగ భృతి కింద యువతకు నెలకు 3000 రూపాయలు చెల్లిస్తామని ఇచ్చిన హామీల ఊసు ఇప్పటి వరకు లేదు. వీటితో పాటు ఇంకా చాలా హామీలను కూటమి సర్కారు తుంగలో తొక్కింది. కానీ పారిశ్రామికవేత్తల కోసం చట్టం తెచ్చి వాళ్ళ ప్రయోజనాలు కాపాడుతారట.



