Telugu Gateway
Andhra Pradesh

వైసీపీలో ‘అవినాష్ రెడ్డి టెన్షన్’!

వైసీపీలో ‘అవినాష్ రెడ్డి టెన్షన్’!
X

ఎన్నికల ఏడాది ఈ పరిణామాలు పార్టీ కి ఏమైనా మేలు చేస్తాయా?. ప్రతిపక్షంలో ఉండగా చెప్పింది ఒకటి...ఇప్పుడు పూర్తిగా వ్యవహారం రివర్స్ గేర్ లో నడుస్తోంది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ అప్పుడు లేని టెన్షన్....ఆందోళన ఇప్పుడే ఎందుకు వస్తోంది. అవినాష్ రెడ్డి ని అరెస్ట్ చేసి విచారణ చేసిన తర్వాత సిబిఐ అడుగులు విచారణ కోసం అయినా మరింత ముందుకు పడితే రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది అనే భయం కీలక నేతల్లో ఉందా అన్న చర్చ సాగుతోంది వైసీపీ నేతల్లో. మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కు సంబంధించి సీఎం జగన్ వేసిన రివర్స్ గేర్ లు పార్టీ కి పెద్ద డ్యామేజ్ చేయటం తప్పదనే భయం ఇప్పుడు వైసీపీ నేతలను వెంటాడుతుంది. తొలుత ఈ హత్య వెనక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అప్పటి మంత్రి ఆదినారాయణ రెడ్డి ఉన్నారని నారసురా రక్త చరిత్ర అంటూ సాక్షి లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇది ఒక్కటే కాదు..ప్రతిపక్షంలో ఉండగా సిబిఐ విచారణకు డిమాండ్ చేసిన జగన్...సీఎం అయినా తర్వాత సిబిఐ విచారణ అక్కరలేదు అని ప్రకటించటం కూడా అప్పట్లో దుమారం రేపింది. ఇప్పుడు సిబిఐ విచారణలో వెలుగులోకి వస్తున్నా వివరాలతో జగన్ ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్ధం అవుతోంది అని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. సిబిఐ విచారణలో సీఎం జగన్, వైసీపీ నేతలు ఆరోపించినట్లు అసలు విచారణ సంస్థ చంద్రబాబు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అంతే కాదు తొలుత చంద్రబాబాబు..ఇతర టీడీపీ నేతలకు ఈ హత్య కుట్రను ఆపాదించిన నేతలు...కేసు తుది దశకు చేరే సమయంలో వివేకా ఆస్తుల కోసం హత్య జరిగింది...అక్రమ సంబంధాల వల్ల హత్య జరిగింది అంటూ బహిరంగాంగా ప్రకటించటమే కాదు...ఏకంగా మీడియా ముందు కూడా ప్రకటనలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ అంశం ప్రతిపక్షాలకు ప్రధాన ఆయుధంగా మరి..తమను దెబ్బ తీయటం ఖాయం అనే భయం వైసీపీ నేతలను వెంటాడుతోంది. అది కూడా స్వయంగా జగన్ బాబాయ్ హత్య కేసు లో ఇలాంటి పరిణామాలు జరిగితే ప్రజలకు సమాధానం చెప్పటం కష్టమే అనే అభిప్రాయం ఎక్కువమంది నేతల్లో ఉంది అని ఒక మంత్రి తెలిపారు. దీంతో పాటు గత కొన్ని రోజులుగా దేశంలోనే టాప్ విచారణ సంస్థగా పేరున్న సిబిఐ తో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆటాడుకుంటున్న తీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

కారణాలు ఏమైనా కూడా సిబిఐ తన పరువు పోగొట్టుకుంటోంది అనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. వై ఎస్ వివేకా హత్య కేసు తో నిజంగా అవినాష్ రెడ్డి కి ఎలాంటి సంబంధం లేదు అని సిబిఐ భావిస్తే పూర్తిగా వదిలేసినా ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ తెలంగాణ హై కోర్ట్ కు మాత్రం అవినాష్ రెడ్డి ని అరెస్ట్ చేసి విచారణ చేస్తేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారికంగా చెప్పి అగ్రశ్రేణి విచారణ సంస్థ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు దుమారం రేపుతోంది. అవినాష్ రెడ్డి ఒక సారి షార్ట్ నోటీసు అని విచారణకు హాజరు కాలేను అన్నారు...తర్వాత తన తల్లికి ఆరోగ్యం బాగాలేదు అని అందుకే తాను వారం వరకు విచారణకు అందుబాటులో ఉండలేను అని తెలిపారు. సహజంగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నది హైదరాబాద్ లోనే అని ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ కర్నూల్ లో ఉంచి అవినాష్ రెడ్డి తన తల్లికి అక్కడ చికిత్స అందిస్తున్న తీరుపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగా మెరుగైన చికిత్స కోసం అయితే హైదరాబాద్ లేదా బెంగళూరు, చెన్నై వెళతారు కానీ కర్నూల్ లో ఉంచుతారా అన్న అనుమానాలు రాక మానవు. వైసీపీ సర్కారుపై రాజధాని అంశంతో పాటు పోలవరం, ప్రత్యేక హోదా తదితర విషయాలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. వీటికి తోడు వచ్చే ఎన్నికల్లో వివేకా హత్య కేసు తో పాటు కోడి కత్తి కేసు కూడా ముందు వరసలో ఉంటాయని వైసీపీ నేతలు భయపడుతున్నారు. మరి ఈ కేసు లకు రాబోయే రోజుల్లో ఎలాంటి ముగుంపు వస్తుందో వేచిచూడాల్సిందే. సాగుతున్న అవినాష్ రెడ్డి ఎపిసోడ్ కారణంగా ఈ అంశం నిత్యం ప్రజల్లో నాని పార్టీ కి మరింత డ్యామేజ్ చేస్తుంది అని వైసీపీ నేతలు భయపడుతున్నారు.

Next Story
Share it