Telugu Gateway
Andhra Pradesh

అప్పుడు కియా పై...ఇప్పుడు అదానీ కంపెనీపై

అప్పుడు  కియా పై...ఇప్పుడు అదానీ కంపెనీపై
X

అప్పుడు వైసీపీ. ఇప్పుడు టీడీపీ. ఆంధ్ర ప్రదేశ్ లో అయినా ఏమీ మారలేదు. అనంతపురం లో కియా ప్రతినిధులపై అప్పటి అధికార పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ దాడి తరహా చర్యలు. ఇప్పుడు కడపలో అదానీ కంపెనీపై ఒకప్పటి టీడీపీ మాజీ మంత్రి, ప్రస్తుతం కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మనుషుల దాడి. పారిశ్రామికవేత్తలకు ఎలాంటి సంకేతాలు పంపుతుంది. అధికారంలో ఎవరు ఉంటే వాళ్లకు రాష్ట్రంలో యూనిట్ లు ఏర్పాటు చేసే కంపెనీలు కాంట్రాక్టు లు ఇవ్వాల్సిందేనే. కంపెనీలు తమకు నచ్చినట్లు పనులు అప్పగించుకోవటానికి వీలులేదా. ముఖ్యంగా రాయలసీమలో అయితే ఎంత పెద్ద బ్రాండ్ ఉన్న కంపెనీ అయినా స్థానిక నేతలు చెప్పిన వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. లేకపోతే ఇబ్బందులు తప్పవనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అంతే కాదు ఆ లీడర్లు పవర్ ఫుల్ అయితే ఆయా యూనిట్స్ లో రవాణా కాంట్రాక్టు లతో పాటు వీలును బట్టి ఇతర పనులను కూడా ఆ పవర్ ఫుల్ లీడర్లు దక్కించుకుంటారు.

ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే కడప జిల్లాలో అదానీ కంపెనీ నిర్మిస్తున్న పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ పనులను అడ్డుకునే ప్రయత్నం చేయటం. అదానీ ఇప్పుడు ఎంత పవర్ ఫుల్ పారిశ్రామిక వేత్తనో అందరికి తెలిసిందే. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ప్రధాని మోడీ కి అదానీ ఎంతో సన్నిహితం అని ప్రచారం ఉంది. ఇప్పుడు ఈ పనులను అడ్డుకునే ప్రయత్నం చేసి...దాడి చేసింది బీజేపీ ఎంపీ ఆదినారాయణ రెడ్డి కి సంబంధించిన కుటుంబ సభ్యులు...వాళ్ళ మనుషులు కావటం విశేషం. దాడికి పాల్పడిన వారిపై పోలీస్ కేసులు పెట్టారు కానీ...ఈ విషయంపై వార్త పబ్లిష్ చేసే సమయానికి ఎక్కడా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారికంగా స్పందించిన దాఖలాలు లేవు. ఒక వైపు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నాం అని చెప్పుకుంటున్న టీడీపీ కి, చంద్రబాబు నాయుడికి అదానీ కంపెనీ దాడి ఘటన ఇరకాటంలోకి నెట్టినట్లు అయింది.

మరో వైపు కూటమి సర్కారులో కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకుంటూ పోతుండటంతో అసలు ఎక్కడా కంట్రోల్ లేకుండా పోయింది అనే అభిప్రాయాన్ని కూడా కొంత మంది టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. పైవాళ్ళు చేస్తున్న పనులు తెలిసే ఎమ్మెల్యేలు కూడా ఎవరి స్టైల్ లో వాళ్ళు బెదిరింపులకు దిగుతున్నారు అనే అభిప్రాయం ఉంది. కూటమి సర్కారులో భాగస్వామిగా ఉన్న పార్టీ ఎమ్మెల్యే సొంత మనుషులు ..అది కూడా అదానీ కంపెనీ పై దాడి కి దిగటం అన్నది ప్రభుత్వ పరువు తీసినట్లు అయింది అనే చర్చ సాగుతోంది. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాత్రం ఉద్యోగాలు అడిగేందుకే తమ వాళ్ళు అక్కడికి వెళ్లారు అని చెపుతున్నా కూడా...అలాంటప్పుడు దాడి చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అన్న ప్రశ్న ఉదయించకమానదు. ఒక వైపు ఏపీ లో కొత్త పెట్టుబడులకు మంగళవారం నాడు చంద్రబాబు ఆధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబి ఆమోదం తెలిపేందుకు సమావేశం అయితే...అదే రోజు అదానీ ప్రాజెక్ట్ పనులను అడ్డుకొనే ప్రయత్నం చేయటం విశేషం.

Next Story
Share it