Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపు..సెస్ పేరుతో 720 కోట్ల బాదుడు

ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపు..సెస్ పేరుతో 720 కోట్ల బాదుడు
X

ఛార్జీల పెంపుకు ఇప్పుడు కొత్త పేరు. తెలంగాణ అయినా..ఏపీ అయినా అదే మోడ‌ల్ ఫాలో అవుతున్నాయి. డీజిల్ సెస్ పేరుతో తాజాగా ఏపీ స‌ర్కారు ప్ర‌యాణికుల‌పై భారం మోపింది. దీని ద్వారా ఆర్టీసికి అద‌నంగా 720 కోట్ల రూపాయ‌లు రానున్నాయి. గ‌తంలో చార్జీల స‌వ‌ర‌ణ చేసిన‌ప్ప‌టికి..ఇప్ప‌టికే డీజిల్ ధ‌ర‌లు భారీగా పెర‌గ‌టంతో ఇది త‌ప్ప‌టంలేదన్నారు.డీజిల్ ధరల పెరుగుదలతో ఆర్టీసీ ఛార్జీలు పెంచినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. పల్లెవెలుగు బస్సు కనీస ఛార్జీ రూ. 10 ఉంటుందని తెలిపారు. పల్లెవెలుగు బస్సుల్లో రూ. 2, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రూ. 5 పెంచినట్లు ఆర్టీసీ ఎండీ చెప్పారు. ఏసీ బ‌స్సుల్లో ఒక్కో టిక్కెట్ పై ప‌ది రూపాయ‌ల భారం ప‌డ‌నుంది. డీజిల్‌ బల్క్‌ రేటు విపరీతంగా పెరిగిందని ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. రేపట్నుంచి పల్లె వెలుగు బస్సులో కనీస చార్జి రూ.10 ఉంటుందని ఆయన వెల్లడించారు.

సెస్‌ పెంపు వల్ల ఆర్టీసీకి రూ.720 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ఆర్టీసీ ఎండీ వెల్లడించారు.ప్రస్తుతం ఆర్టీసీలో భారం భరించలేని పరిస్థితి ఉందని ద్వారకా తిరుమలరావు అన్నారు. ఉపయోగంలో లేని ఆర్టీసీ ఖాళీ స్థలాలను లీజుకు ఇస్తామని ఆర్టీసీ ఎండీ చెప్పారు. కార్గో సేవల ద్వారా కూడా ఆర్టీసీ ఆదాయం పెంచుకుంటామని ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. ప్ర‌స్తుతం ఆర్టీసీకి నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు కూడా రావ‌టం లేద‌ని..త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లోనే ఛార్జీల‌ను పెంచాల్సి వ‌చ్చింద‌న్నారు. ఈ స‌వ‌ర‌ణ వ‌ల్ల బ‌స్సు పాస్ ల ధ‌ర‌లు కూడా పెరుగుతాయ‌న్నారు.. ప్ర‌స్తుతం ఆర్టీసీకి రోజుకు 12 నుంచి 12.5 కోట్ల రూపాయ‌ల మేర న‌ష్టం వ‌స్తుంద‌ని తెలిపారు.

Next Story
Share it