ఇలా ఎక్కడా జరగదేమో!
తంలో ఎన్నడూ లేని రీతిలో ఆంధ్ర ప్రదేశ్ సమాచార హక్కు చట్టం ఆఫీస్ వ్యవహారాలు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాయి. సమాచార హక్కు ప్రధాన కమిషనర్, కమిషనర్ల మధ్య విబేధాలు తలెత్తినట్లు కొన్నిరోజులుగా అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే తాజాగా ఆంధ్ర ప్రదేశ్ సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ ఆర్. మెహబూబ్ బాషా ఇచ్చిన సర్కులర్ హాట్ టాపిక్ గా మారింది. నిజంగా సమాచార కమిషనర్ లుగా ఉన్న వాళ్ళు ఇలా ఒక సర్కులర్ తో ఇలా చెప్పించుకోవటం కంటే అంతకంటే అవమానం మరొకటి ఉండదు అని చెప్పొచ్చు. అత్యంత కీలకమైన బాధ్యతల్లో ఉన్న వారి వ్యవహారం ఇలా రచ్చకెక్కటం అధికార వర్గాలను కూడా షాక్ కు గురి చేస్తోంది. అయితే ప్రధాన కమిషనర్ ఇలా సర్కులర్ జారీ చేయటానికి ప్రధాన కారణం కొంత కమిషనర్లు అసలు ఆఫీస్ వైపు కూడా రాకుండా తమకు మాత్రం జీతాలు, ఇతర అన్ని సౌకర్లు కావాలని కోరుతున్నారు అని చెపుతున్నారు.
ఇదే కారణంతో సమాచార కమిషనర్లు విధిగా ప్రతి రోజు ఆఫీస్ కు వచ్చిన సమయం తో పాటు సాయంత్రం ఐదున్నరకు ఇంటికి వెళ్లే సమయంలో కూడా విధిగా సంతకాలు పెట్టాలని ప్రధాన కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. వీటి ఆధారంగానే అకౌంట్స్ అధికారులు కమిషనర్ల జీతాలతో పాటు ఇతర అలవెన్స్ ల విషయంలో బిల్స్ సిద్ధం చేయాలని ఆదేశించారు. కొద్ది రోజుల క్రితం ప్రధాన కమిషనర్ బాషా ఇతర కమిషనర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు, జిల్లాల పర్యటనలకు అనుమతించకపోవటంతో పాటు వాళ్లకు చట్టబద్ధంగా రావాల్సిన సౌకర్యాలు కూడా అందకుండా చేస్తున్నారు అంటూ చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇప్పుడు ప్రధాన కమిషనర్ ప్రతి రోజు కమిషనర్లు ఉదయం, సాయంత్రం ఆఫీస్ కు వచ్చి సంతకాలు చేస్తేనే జీతాలతో పాటు ఇతర బిల్స్ క్లియర్ చేయాలని స్పష్టంగా మెమో జారీ చేయటంతో ఇక్కడ వివాదం నిజం అని తేలిపోయింది. అయితే కొంత మంది కమిషనర్లు అసలు ఆఫీస్ వైపు కూడా చూడకుండా ఇష్ఠానుసారం వ్యవహరిస్తుండంతోనే ఈ ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది అన్నది మరికొంత మంది వాదన. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ సమాచార చట్టం కమిషనర్లుగా పీ. శామ్యూల్ జోనాథన్, చావలి సునీల్, రెహానా బేగం, ఎల్లారెడ్డి ఉదయ్ భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ప్రధాన కమిషనర్ తో పాటు ఇతర కమిషనర్లు కూడా జగన్ హయాంలో నియమించినవారే.