జీతాలు తగ్గినా ట్రెజరీ ఉద్యోగులకు ఆదివారం పని

సర్కారు హెచ్చరికలు ఫలించాయి. ఓ వైపు పీఆర్సీ కారణంగా తమ వేతనాలు తగ్గాయంటూ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. అంతే కాదు..గతంలో ఎన్నడూలేని రీతిలో అన్ని సంఘాలు ఒక్కటై ఉద్యమ బాట పట్టాయి. అయితే ప్రభుత్వం మాత్రం అంతే పట్టుదలగా జనవరి నెలకు కొత్త పీఆర్సీతో వేతనాలు ఇవ్వాలని నిర్ణయించింది. అందుకే ట్రెజరీ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసింది. నిబందనల ప్రకారం బిల్లుల ప్రాసెస్ చేయకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. దీంతో ఏపీకి చెందిన ట్రెజరీ ఉద్యోగులు ఆదివారం నాడు కూడా పనిచేస్తున్నారు.
ఓ వైపు జీతాలు తగ్గాయని ఆందోళనలు చేస్తుంటే ఈ అదనపు పని ఏంటో అంటూ వారు నిట్టూరుస్తున్నారు. 11వ పీఆర్సీ ప్రకారం జీతాలు ప్రాసెస్ చేసి బిల్లులు అప్ లోడ్ చేయాలని ట్రెజరీ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉద్యోగులు అందరూ సమ్మెకు నోటీసు ఇచ్చి ఉన్నారు. సర్కారుతో చర్చలు కొలిక్కిరాకపోతే ఫిబ్రవరి ఆరవ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు పోవాల్సి ఉంటుంది. అయితే ఈ లోగా పనిచేయకుండా ఉండటానికి ఏ మాత్రం ఛాన్స్ లేకపోవటంతో సర్కారు ఆదేశాల మేరకు ట్రెజరీ ఉద్యోగులు పనికానిచ్చే్స్తున్నారు.