ఏపీలో టెన్త్ పేపర్ లీక్ కలకలం..ఖండించిన సర్కారు
పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అయిన తొలిరోజే ఏపీలో కలకలం. బుధవారం ఉదయం పదకొండు గంటల సమయంలో పదవ తరగతి పరీక్ష పత్రం సోషల్ మీడియాలో ప్రత్యక్ష్యం కావటంతో ఒక్కసారిగా దుమారం రేగింది. అయితే పరీక్ష ప్రారంభం అయింది 9.30 గంటలకు అయితే..ఈ ప్రశ్నాపత్రం బయట కన్పించింది మాత్రం 11 గంటల ప్రాంతంలో. ఈ విషయాన్ని గమనంలోకి తీసుకుని ఇది ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసిన పని తప్ప..లీక్ కాదని అధికారులు ఈ వార్తలను ఖండించారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు విద్యా శాఖ కమిషనర్ సురేష్ వెల్లడించారు. నిర్దేశిత సమయం కంటే ముందే పేపర్ బయటకు వచ్చిన అంశంపై ఇన్విజిలేటర్, సూపర్ వైజర్‌ను జిల్లా విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారని సమాచారం. ప్రశ్నాపత్రాన్ని సోషల్ మీడియాలో పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కర్నూలు జిల్లాతోపాటు చిత్తూరు జిల్లాలోనూ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు ప్రచారం జరగటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. అయితే ఇది అంతా తప్పుడు ప్రచారం అని..అంతా సాఫీగా సాగుతుందని అధికారులు తెలిపారు.