Telugu Gateway
Andhra Pradesh

లేట్ అయితే ఏపీ ప్రభుత్వం ఆగిపోతుందా?

లేట్ అయితే  ఏపీ ప్రభుత్వం ఆగిపోతుందా?
X

గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వంపై ఈ సారి పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. కీలక శాఖలు అన్నిటిలో అడ్డగోలు దోపిడీ సాగుతోంది అనే చర్చ టీడీపీ నేతల్లోనే ఉంది. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఊతపదం మారిపోయాను అని చెప్పటం. కానీ ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఏమి జరిగినా కూడా చూసీచూడకుండా వదిలేసేలా మారిపోయారా?..లేక ప్రభుత్వంలో జరుగుతున్న విషయాలు అన్ని తెలిసి కూడా ఏమి చేయలేం అని వదిలేసేలా మారిపోయారా?. మారటం అంటే ఇదేనా?. ఒకటి మాత్రం నిజంఅని..అవినీతిని..అడ్డగోలుతనాన్ని ఏమిచేయలేని విధంగా చంద్రబాబు మారిపోయారు అంటూ సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం పాలన ఎలా సాగుతుందో చెప్పటానికి ఈ ఒక్క ఫోటో చాలు అని ఒక టీడీపీ మంత్రి అభిప్రాయపడ్డారు. అది పెద్ద పోస్టా..చిన్న పోస్టా అన్న సంగతి పక్కనపెడితే ఒక పదవి నుంచి దించేందుకు ఏ మాత్రం మానవత్వం లేకుండా హాస్పిటల్ బెడ్ మీద ఉన్న వ్యక్తినుంచి ఒక మంత్రి రాజీనామా లేఖ తీసుకున్న ఫోటో మాత్రం పెద్ద ఎత్తున చర్చనీయంగా మారింది.

పార్టీ నిర్ణయానికి భిన్నంగా చలసాని ఆంజనేయులు విజయా డైరీ చైర్మన్ గా మరో సారి ఎన్నిక అయితే ఆ విషయాన్ని డీల్ చేసేందుకు ఎన్నో మార్గాలు ఉంటాయి. మరో సారి విజయా డైరీ చైర్మన్ పదవికి కొత్తగా ఆయన ఎన్నికై రోజులు కూడా గడవముందే కొంత మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ పదవికి రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున ఒత్తిడి చేయటం వల్లే ఆయన హాస్పిటల్ పాలు అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కూడా ఏ మాత్రం వెరవకుండా హాస్పిటల్ కు వెళ్లి మరీ ఆయన దగ్గర రాజీనామా లేఖ తీసుకోవటంతో టీడీపీ ప్రభుత్వం ఎంత అమానవీయంగా వ్యవహరించిందో కళ్లకుకట్టినట్లు అయింది. రాజకీయాలకు జాలి..దయ ఉండవు అని చెపుతారు.

కానీ చివరకు సొంత పార్టీ నేత విషయంలో కూడా మెడ మీద కట్టి పెట్టిన తరహాలో హాస్పిటల్ కు వెళ్లి మరీ రాజీనామా లేఖ తీసుకోవాల్సిన అవసరం ఉందా అన్న చర్చ టీడీపీ మంత్రుల్లో...ఎమ్మెల్యేల్లో కూడా సాగుతోంది. ఇది చూసి వైసీపీ కంటే టీడీపీ ఎందులో భిన్నం అనే సందేహం కూడా ప్రజల్లో వస్తోంది అని ఒక నాయకుడు వ్యాఖ్యానించారు. ఈ ఒక్క ఫోటో ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వాన్ని ..ముఖ్యంగా టీడీపీని రాజకీయంగా దారుణమైన దెబ్బ కొట్టడం ఖాయం అనే చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది. ఎక్కడైనా సరే తాము చెప్పినట్లే వినాలని...లేదు అంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది అనే సంకేతాలు అందరికి ఇచ్చినట్లు ఉంది అనే చర్చ కూడా సాగుతోంది. టీడీపీ లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు లేవు అని..ఇప్పుడు అన్ని కొత్త కొత్త సంప్రదాయాలు తెస్తున్నారు అని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Next Story
Share it