Telugu Gateway
Andhra Pradesh

ముగిసిన వివాదాల ఎస్ఈసీ రమేష్ కుమార్ పదవి కాలం

ముగిసిన వివాదాల ఎస్ఈసీ రమేష్ కుమార్ పదవి కాలం
X

నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఏడాది కాలంగా ఏపీలో ఈ పేరు పెద్ద సంచలనంగా మారింది. ఎక్కువ వివాదాలే ఆయన్ను చుట్టుముట్టాయి. స్థానిక ఎన్నికలను అకస్మాత్తుగా వాయిదా వేస్తూ ఆయన గత ఏడాది తీసుకున్న నిర్ణయం ఏ మాత్రం రుచించని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గవర్నర్ దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేయటమే కాకుండా..తర్వాత మీడియా సమావేశం నిర్వహించి సామాజికపరమైన అంశాలను ప్రస్తావించి కొత్త దుమారానికి కారణం అయ్యారు. నిమ్మగడ్డ నిర్ణయాలు ఎంత వివాదస్పదం అయ్యాయో...ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు కూడా అంతే వివాదస్పదం అయ్యాయి. ఆ తర్వాత ఏపీ మంత్రులు అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాడిన భాష రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ ఎవరిపై వాడి ఉండరనే చెప్పొచ్చు. అయితే అంతకు ముందు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోం శాఖకు రాసిన లేఖ..అందులోని అంశాలు కూడా అంతే స్థాయిలో అభ్యంతరకరంగా ఉన్నాయనే విమర్శలు ఆయన ఎదుర్కొన్నారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న పలు నిర్ణయాల్లో కొన్నింటిని కోర్టులు ఓకే చేశాయి..మరికొన్నింటిని కొట్టేశాయి.

గతంలో ఏ ఎస్ఈసీ కూడా ఇంత వివాదస్పదం అయిన సందర్భం లేదు. తొలుత నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు పూర్తి అండగా నిలిచిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తర్వాత తర్వాత ఆయనపై విమర్శలు చేయటం ప్రారంభించింది. అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీ నుంచి కూడా ఆయన చివరి దశలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు బుధవారం నాడే చివరి రోజు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని, ప్రభుత్వ తోడ్పాటుతోనే ఇది సాధ్యమైంది. ఎన్నికల నిర్వహణ పట్ల తాను పూర్తి సంతృప్తిగా ఉన్నాను. రీపోల్ లేకుండా ఎన్నికలు నిర్వహించడం చాలా అరుదుగా జరుగుతుందన్నారు.

స్థానిక ఎన్నికల్లా కాకుండా సాధారణ ఎన్నికల స్థాయిలో ఈ ఎన్నికలు నిర్వహించామన్నారు. ఇవన్నీ ప్రభుత్వం, సీఎస్ నుంచి పూర్తి సహకారం లభించిందని, మీడియా ద్వారా సిఎస్‌కు, సహచర ఉద్యోగులకు ధన్యవాదాలు తెలియచేస్తున్నానన్నారు. వ్యవస్థల మధ్య అంతరాలు అనవసరంగా వచ్చాయని, ఎన్నికల సిబ్బందిని సెలవుల్లో వెళ్ళమన్నారని.. దీన్ని వెంటనే చక్కదిద్దామన్నారు. తన ఓటు తెలంగాణలో రద్దు చేసుకుని సొంత గ్రామంలో ఓటు అడిగానని, అది నిరాకరించడంవల్ల టీ కప్పులో తుఫానుగా మారిందన్నారు. ఇప్పటికీ తన ఓటు హక్కు కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. ఓటు హక్కు కోసం అవసరమైతే హైకోర్టుకు వెళతానన్నారు. ఏపీ హైకోర్టు పంచాయతీ ఎన్నికల్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిందని నిమ్మగడ్డ అన్నారు.

ఎన్నికల కమిషన్ ఒక రాజ్యాంగ వ్యవస్థ అని, 243కె ద్వారా విస్తృత అధికారాలు రాజ్యాంగం కల్పించిందన్నారు. ఎన్నికల కమిషన్ ఇతర వ్యవస్థలలో జోక్యం చేసుకోకూడదని, వాటికి గౌరవం ఇవ్వాలన్నారు. వ్యవస్థలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. నామినేషన్ వెయ్యనివ్వలేనప్పుడు మరో అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నం చేశామని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు మీడియా అందించిన సహకారానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.అధికారిక సమాచారాన్ని తానెప్పుడూ లీక్ చేయలేదన్నారు. రాజ్యాంగ సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలన్నదే తన నిర్ణయం అన్నారు.

Next Story
Share it