Telugu Gateway
Andhra Pradesh

సర్కారు కోర్టుకు పోకపోతేనే ఆశ్చర్యం

సర్కారు కోర్టుకు పోకపోతేనే ఆశ్చర్యం
X

పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) తీసుకొచ్చిన 'ఈ-వాచ్' యాప్ ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం నాడు ఆవిష్కరించారు. గతంలోనూ ఎన్నికల కోసం సాంకేతిక పరిజ్ణానం వాడినట్లు తెలిపారు. ఇది ఎస్ఈసీ తయారు చేయించిన యాప్ అని..ఇందులో ఇతరుల ప్రమేయం లేదన్నారు. అధికార వైసీపీ మొదటి నుంచి ఈ యాప్ పై విమర్శలు గుప్పిస్తోంది. అంతే కాదు..యాప్ పై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేయగా..గురువారం నాడు రెగ్యులర్ పిటీషన్ గా విచారిస్తామని స్పష్టం చేసింది. ఈ- వాచ్ యాప్ పై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించటంపై స్పందిస్తూ వెళ్ళకపోతే ఆశ్చర్యపోవాలి కానీ..వెళితే ఆశ్చర్యం ఏముందని నిమ్మగడ్డ ప్రశ్నించారు. ఎవరి పని వాళ్ళు చేస్తారన్నారు. ఎన్నికలు పెట్టాలని సుప్రీంకోర్టే చెప్పిందని తెలిపారు.

గురువారం నుంచి యాప్ అందుబాటులోకి వస్తుందని..నేరుగా ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. ఎక్కడైనా ఎన్నికల్లో తీవ్రమైన గొడవలు జరిగితే అధికారులు సత్వరమే స్పందించాల్సి ఉంటుందని..లేదంటే ఆ ఎన్నికలను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. తాను నాలుగు గోడల మధ్య ఉండనని..జిల్లాల్లో పర్యటిస్తానని వ్యాఖ్యానించారు. పారదర్శకతతో పాటు ప్రజల్లో నమ్మకం కల్పించేందుకే ఈ యాప్ తెచ్చామన్నారు. ఓటర్లు పంచాయతీ ఎన్నికలను ఓ పండగలా భావించి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ ఎన్నికలకు జిల్లాల్లోని యంత్రాంగం ఎంతో బాగా పనిచేస్తుందని పేర్కొన్నారు.

Next Story
Share it