Telugu Gateway
Andhra Pradesh

పీఆర్సీ పోరు..స‌మ్మె నోటీసు ఇచ్చిన ఏపీ ఉద్యోగ సంఘాలు

పీఆర్సీ పోరు..స‌మ్మె నోటీసు ఇచ్చిన ఏపీ ఉద్యోగ సంఘాలు
X

ఏపీలో స‌మ్మె అనివార్యంగా క‌న్పిస్తోంది. ఉద్యోగ సంఘాలు స‌ర్కారుకు స‌మ్మె నోటీసు ఇవ్వ‌టంతో ఇక దిగి వ‌చ్చేది ఎవ‌రో తేలాల్సి ఉంది. ఫిబ్ర‌వ‌రి 6 నుంచి స‌మ్మెకు వెళ‌తామ‌ని ఉద్యోగ సంఘం నేత‌లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇదే అంశాన్ని వివ‌రిస్తూ పీఆర్సీ జీవోలు వెన‌క్కి తీసుకోవాల‌నే ప్ర‌ధాన డిమాండ్ తో పీఆర్సీ సాధ‌న స‌మితి పేరుతో నోటీసు అంద‌జేశారు. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీర్ శ‌ర్మ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌టంతో ఈ నోటీసును జీఏడీ ముఖ్య కార్య‌ద‌ర్శి శ‌శిభూష‌ణ్ కుమార్ కు అంద‌జేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల సంఘాల తరఫున సమ్మె నోటీసు అంద‌జేశారు. దీని కోసం అన్ని సంఘాల‌తో స్టీరింగ్ క‌మిటీ ఏర్పాటు అయిన విష‌యం తెలిసిందే. ఉద్యోగుల అభ్యంత‌రాల‌ను, అభిప్రాయాల‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా పీఆర్సీ జీవోల‌ను జారీ చేశార‌ని త‌మ నోటీసులో పేర్కొన్నారు.

అన్ని విభాగాల వారిని క‌లుపుకుని పీఆర్సీ స్ట్ర‌గుల్ క‌మిటీగా ఏర్ప‌డ్డారు. స‌మ్మె నోటీసు ఇచ్చినా కూడా ఉద్యోగ సంఘాల‌తో తాము చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. అదే స‌మయంలో ఆయ‌న ట్రెజ‌రీ ఉద్యోగుల గురించి ప్ర‌స్తావిస్తూ వాళ్ళు అలాగే చేస్తే తాము క్ర‌మ‌శిక్షణ అంశాల‌ను కూడా ఆలోచించాల్సి ఉంటుంద‌ని ప‌రోక్షంగా హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. స్వ‌యంగా జీఏడీ ముఖ్య కార్య‌ద‌ర్శి ఫోన్ చేసి చ‌ర్చ‌ల‌కు ఆహ్వానిస్తే త‌మ‌ది అధికారిక క‌మిటీ కాద‌ని ఎలా అంటార‌ని స‌జ్జ‌ల ప్ర‌శ్నించారు. చ‌ర్చ‌ల‌కు వ‌స్తే వారికి ఉన్న అపోహ‌ల‌ను తొల‌గించే ప్ర‌య‌త్నం చేస్తామ‌న్నారు.

Next Story
Share it