స్పందన చూశారుగా..సీఎందే బాధ్యత
రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా..నిర్భందాలు అమలు చేసినా పీఆర్సీ జీవోల రద్దుకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఎలా తరలివచ్చాయో చూశారుగా ఇక స్పందించాల్సింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని ఉద్యోగ సంఘాల నేతలు వ్యాఖ్యానించారు. తామేమీ గొంతెమ్మ కోరికలు కోరటంలేదని..ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించి పరిస్థితి సమ్మె వరకూ వెళ్లకుండా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం అయిన తర్వాత ఉద్యోగ సంఘం నేతలు బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడారు. తాము బల ప్రదర్శన చేయటంలేదని..తమ బాధలు చెప్పుకునేందుకు వచ్చామన్నారు. వేతనాలు పడ్డాక జీతాలు పెరిగితే ఎవరైనా ఉద్యమం చేయటానికి బయటకు వస్తారా? అని ప్రశ్నించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. గతంలో అందిన ప్రయోజనాలు కూడా లేకుండా చేయటం దారుణం అన్నారు. గతంలో చర్చల పేరుతో ఉద్యోగ సంఘాలను అవమానించారని...ఉద్యోగ సంఘం నేతలను సీఎం జగన్ దగ్గరకు తీసుకెళ్ళినా ఆయన చెప్పింది విని రావటం తప్ప తమకు మాట్లాడే ఛాన్స్ రాలేదన్నారు.
తమ ఉద్యమం వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నారని..కొంత మంది వ్యాఖ్యలు చేస్తున్నారని..అది సరికాదన్నారు. తమ వెనక ఉన్నది ఉద్యోగులు మాత్రమే అని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టింపులకు పోకుండా బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వ తీరును గుర్తించాలని ఉద్యోగ సంఘం నేతలు కోరుతున్నారు. చలో విజయవాడ కార్యక్రమానికి భారీ ఎత్తున ఉద్యోగులు విజయవాడ తరలిరావటంతో ఆ బీఆర్ టిఎస్ ప్రాంతం.. రహదారులు కిక్కిరిసిపోయాయి. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. డ్రోన్ల ద్వారా కూడా ఉద్యోగుల ర్యాలీని కవర్ చేశారు. చాలా మందిని విజయవాడ పరిసర ప్రాంతాల్లో నిలుపుదల చేసినా..పెద్ద ఎత్తున నగరంలోకి ప్రవేశించారు ఉద్యోగులు. విజయవాడ సీపీ అసలు ఈ కార్యక్రమానికి అనుమతిలేదని ప్రకటించారు. అయినా కూడా ఎవరూ ఊహించని స్థాయిలో ఉద్యోగులు తరలిరావటం చర్చనీయాంశంగా మారింది. మరి తాజా పరిణామాలపై సర్కారు ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సాయంత్రం ఆరు గంటలకు దీనిపై స్పందించనున్నారు.