Telugu Gateway
Andhra Pradesh

మీడియా లో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం!

మీడియా లో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం!
X

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు దగ్గర దగ్గర మూడేళ్లు...తెలంగాణ లో ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉంది. ఈ సమయంలో మీడియా రంగంలో కూడా కీలక మార్పులు చోటు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా లో కీలక పరిణామాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒక కీలక ఛానల్ చేతులు మారినట్లు చెపుతున్నారు. ఈ కీలక టీవీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చేతిలోకి వెళ్లినట్లు మీడియా సర్కిల్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఒక వైపు ఆ టీవీ లో పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపు సాగుతోంది...మరో వైపు కీలక స్థానాల్లో కొత్త వ్యక్తులు వచ్చి చేరుతున్నట్టు చెపుతున్నారు. ఈ ఛానల్ లో తనకు ఉన్న వాటాను ఒక ప్రముఖ కాంట్రాక్టు సంస్థ కూటమి ప్రభుత్వ పెద్దలు చెప్పిన వారికి బదిలీ చేయటానికి సిద్ధం అయింది అని..అందుకు ప్రతిగా మరో కొత్త ప్రాజెక్ట్ ఇవ్వటమో...లేక మరో రూపంలోనో ఈ మొత్తాన్ని సర్దుబాటు చేసే అవకాశం ఉంది అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి.

ఎప్పటి నుంచో ఆ ఛానల్ ప్రభుత్వ వ్యతిరేక స్టాండ్ తీసుకుంది. దీంతో ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ వాటాలను దక్కించుకోవటం ద్వారా ఆ ఛానల్ మొత్తాన్ని ఇప్పుడు తమ నియంత్రంలోకి తెచ్చుకునే పనిలో కూటమి సర్కారు ఉన్నట్లు చెపుతున్నారు. ఇందులో నేరుగా ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా కూడా ఒక ప్రధాన పార్టీ తెర వెనక ఉండి ఈ కథ అంత నడిపించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇది ఒక్కటే కాదు..మరో ఛానల్ కూడా వీలు అయితే ప్రభుత్వంతో రాజీకి సిద్ధంగా ఉంది అనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. టీవీలు ఎన్నికల ఫలితాలను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో తెలియదు కానీ..ఇప్పుడు ఏపీలోని కీలక పార్టీలు ఎవరికి ఛాన్స్ ఉన్న చోట వాళ్ళు ఇప్పటికే మార్కెట్ లో కొంత బ్రాండ్ ఉన్న వాటిపై ఫోకస్ పెట్టి గుట్టుచప్పుడు కాకుండా పనులు నడిపిస్తున్నారు అని చెపుతున్నారు. అయితే ఈ విషయాలు రాబోయే రోజుల్లో అయినా అధికారికంగా బయటకు వస్తాయా లేక కొంత కాలం గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతాయా అన్నది చూడాలి.

Next Story
Share it