Telugu Gateway
Andhra Pradesh

చిన్న శ్రీను చేరితే తప్ప కూటమి విజయం సాధ్యం కాదా?!

చిన్న శ్రీను చేరితే  తప్ప కూటమి విజయం సాధ్యం కాదా?!
X

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ లో మొత్తం అసెంబ్లీ సీట్లు ఉన్నది 175. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం దగ్గర ఉన్నది 164 సీట్లు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మళ్ళీ జగన్ రాడు... వచ్చేది తామే అని పదే పదే కూటమి ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నారు. కానీ విచిత్రంగా జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం లో..ముఖ్యంగా లిక్కర్ రవాణా స్కాం లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు (చిన్న శ్రీను) కు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం సడన్ గా టీడీపీ కండువా కప్పారు. ఇదే మజ్జి శ్రీను డీఎస్ సి స్కాం లో మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. అంతే కాదు టీడీపీ నేతలపై ఆయన చేసిన ఆరోపణలు..విమర్శలు ఎన్నో. జగన్ హయాంలో జరిగిన లిక్కర్ రవాణా స్కాం లో విజిలెన్సు విచారణలో మజ్జి శ్రీను పాత్ర ఉన్నట్లు గుర్తించినా...డీఎస్సీ స్కాం లో లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసినా ఇవేమి పట్టించుకోని చంద్రబాబు మజ్జి శ్రీనును సాదరంగా స్వాగతం పలికి టీడీపీ కండువా కప్పారు. అంటే 164 సీట్లు కూటమి ప్రభుత్వం బలహీనంగా ఉంది...మజ్జి శ్రీనివాస్ టీడీపీ లో చేరితే తప్ప విజయనగరం జిల్లా పరిషత్ తో పాటు ఇతర ఎన్నికలు కూటమి గెలవలేదు అనే సంకేతాలు చంద్రబాబు ప్రజలకు పంపించారా? అన్న చర్చ టీడీపీ లో సాగుతోంది.

కాసేపు ఈ సంగతి పక్కన పెడితే లిక్కర్ రవాణా స్కాం లో ఉన్న టీడీపీ లో చేరిన మజ్జి శ్రీనివాస్ ను కాపాడితే ఇక మిగిలిన వాళ్ళ పై ఉన్న కేసు కూడా బలహీనం అయిపోదా అన్న చర్చ టీడీపీ నేతల్లో కూడా సాగుతోంది. విజయనగరం జిల్లాకు చెందిన నేతలు ఎవరూ కూడా మజ్జి శ్రీనివాసరావు చేరికకు అంగీకరించలేదు. అయినా కూడా చంద్రబాబు ముందుకే వెళ్లారు. అటు రాజకీయ అవసరాలతో పాటు ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలోని కీలక మంత్రి తరపున కిమ్ అండ్ టీం భోగాపురం పరిసర ప్రాంతాల్లో బినామీ పేర్లతో సేకరించిన రెండు వేల ఎకరాల రక్షణకు కూడా భవిష్యత్ లో మాజేజి శ్రీనివాసరావు ఉపయోగపడతారు అనే కోణంలోనే ఈ చేరికకు మార్గం సుగమం చేసినట్లు ఉంది అనే చర్చ టీడీపీ నేతల్లో సాగుతోంది. లిక్కర్ స్కాం విషయంలో తెర వెనక ఎన్నో డీల్స్ జరిగాయి అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో ఉంది. తాజా పరిణామాలతో ఈ కేసు ఏ మాత్రం ముందుకు పోయేది కాదు...వీళ్ళు అంతా పని చేస్తున్నది రాష్ట్రం కోసం కాదు...సొంత ఆర్థిక...రాజకీయ అవసరాల కోసం అన్న విషయం తాజా పరిణామాలతో స్పష్టం అయింది అన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.

Next Story
Share it