ఏపీ కొత్త ఎస్ఈసీ నీలం సాహ్ని
ఏపీ సర్కారు సాధ్యమైనంత వేగంగా పెండింగ్ లో ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తి చేసుకునే యోచనలో ఉంది. వాస్తవానికి ఇవి కూడా ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలోనే పూర్తవుతాయని భావించినా..ఆయన తనకు ఈ ఎన్నికల నిర్వహణకు సమయం సరిపోదని..కొత్తగా వచ్చే ఎస్ఈసీనే ఇవి చూసుకుంటారని ప్రకటించారు. ఈ తరుణంలో ప్రభుత్వం ఏ మాత్రం జాప్యం చేయకుండా ముగ్గురి పేర్లతో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు ప్రతిపాదనలు పంపింది.
అందులో ప్రస్తుతం సీఎం జగన్ సలహాదారుగా ఉన్న నీలం సాహ్నితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు శ్యామూల్, ప్రేమ్ చంద్రారెడ్ది పేర్లను సిఫారసు చేశారు. అయితే గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుక్రవారం నాడు నీలం సాహ్ని పేరుకు ఆమోదం తెలిపారు. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. కొత్త కమిషనర్ గా బాధ్యతలు చేపట్టనున్న నీలం సాహ్ని వెంటనే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది.