Telugu Gateway
Andhra Pradesh

ఉగాది నుంచే కొత్త జిల్లాల్లో పాల‌న‌

ఉగాది నుంచే కొత్త జిల్లాల్లో పాల‌న‌
X

ఏపీ స‌ర్కారు కొత్త జిల్లాల‌కు సంబంధించిన వ్య‌వ‌హారంలో జోరు పెంచింది. ముందు ప్ర‌క‌టించిన‌ట్లుగానే ఉగాది నుంచి అక్క‌డ పాల‌న ప్రారంభించాల‌ని నిర్ణ‌యించింది. దీనికి అవ‌స‌ర‌మైన భవ‌నాలు స‌మ‌కూర్చుకోవ‌టంతోపాటు..ఇత‌ర ఏర్పాట్లు చేసుకోవాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. ఆయ‌న గురువారం నాడు కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప‌లు అంశాల‌పై స‌మావేశం నిర్వ‌హించారు. అందులో ప‌లు ఆదేశాలు జారీ చేశారు. కొత్త జిల్లాల మ్యాపులు, జిల్లా కేంద్రాల నిర్ణయం వెనుక తీసుకున్న ప్రాధాన్యతలను వివరించారు. అలాగే ప్రతిపాదనలపై వస్తున్న అభ్యంతరాలు, సలహాలు, సూచనలు కూడా నిశితంగా పరిశీలిస్తున్నామని అధికారులు సీఎంకు నివేదించారు. ఈ స‌మావేశంలో జ‌గ‌న్ వ్యాఖ్య‌లు ఆయ‌న మాట‌ల్లోనే... 'కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత... యంత్రాంగం అంతా సమర్థవంతంగా పనిచేయాలి. పని ప్రారంభమైన తర్వాత ఎలాంటి అయోమయం ఉండకూడదు, పాలన సాఫీగా ముందుకు సాగాలి.

దీనికోసం సన్నాహకాలను చురుగ్గా, వేగంగా, సమర్థవంతంగా మొదలు పెట్టాలి. వచ్చే ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు కావాలి. ఉగాది నాటికి కొత్త జిల్లాల కలెక్టర్లు , ఎస్పీలు.. ఆయా జిల్లాకేంద్రాల నుంచి పనిచేయాలి. ఉద్యోగుల విభజన, మౌలిక సదుపాయాల ఏర్పాటు, కొత్త భవనాలు వచ్చేలోగా యంత్రాంగం పనిచేయడానికి అవసరమైన భవనాల గుర్తింపు.. అన్నిరకాలుగా కూడా సిద్ధం కావాలి. కొత్తగా మౌలిక సదుపాయాలు ఏర్పాటయ్యేలోగా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు కావాల్సిన భవనాలు తదితర వాటిని గుర్తించాలి. అలాగే కొత్త భవనాల నిర్మాణంపైనా ప్రణాళికలను ఖరారు చేయాలి. అందుకోసం స్థలాల గుర్తింపుపై దృష్టిపెట్టాలి.అభ్యంతరాల విషయంలో హేతుబద్ధత ఉన్నప్పుడు దానిపై నిశిత పరిశీలన చేయాలి. నిర్ణయం తీసుకునేముందు వారితో మాట్లాడ‌టం అన్నది చాలా ముఖ్యం.ఇప్పుడున్న కలెక్టర్లు, ఎస్పీలే కొత్త జిల్లాలకు' అని తెలిపారు.

Next Story
Share it