ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ప్రకటించిన షెడ్యూల్ ఫ్రకారమే ఏపీలోమున్సిపల్ ఎన్నికలు సాగనున్నాయి. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు రద్దు చేసి..కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసేలా ఆదేశాలు జారీ చేయలాంటే పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్లను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. దీంతో ఎన్నికలకు మార్గం సుగమం అయింది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన 16 మధ్యంతర పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. రాష్ట్రంలో 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గతంలో షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే.
ఈ షెడ్యూల్ ప్రకారం మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు..14న ఓట్ల లెక్కింపు జరగనుంది. మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు.. అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. మార్చి 8వ తేదీ సాయంత్రంతో అభ్యర్థుల ప్రచారం ముగియనుంది. అవసరమైతే మార్చి 13న రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది.