Telugu Gateway
Andhra Pradesh

వైజాగ్ ఒక్కటే రాజధాని..మిగిలినవి ఉత్తుత్తి రాజధానులా?

వైజాగ్ ఒక్కటే రాజధాని..మిగిలినవి ఉత్తుత్తి రాజధానులా?
X

మూడు రాజధానులు అనక్కరలేదు. విశాఖపట్నమే రాజధాని. ఇవి సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాద రావు కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు తాజాగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా విశాఖ ఒక్కటే రాజధాని..గుంటూరు లో ఒక సెషన్ మాత్రమే ఉంటుంది అని కూడా ప్రకటించారు. వీళ్ళు ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా నెపాన్ని మాత్రం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ మీడియా మీదకు నెట్టేసి మా విధానం పరిపాలన వికేంద్రీకరణ అని చెపుతున్నారు. గుంటూరు లో ఒక సెషన్ మాత్రమే ఉంటుంది అని బుగ్గన ఎందుకు..ఎలా చెప్పారో తెలియదు అని చెప్పటం అంటే...ఈ విషయంపై అసలు మంత్రి బుగ్గన నుంచి సజ్జల క్లారిటీ కూడా తీసుకోలేదు అని అర్ధం అవుతుంది. ఈ మంత్రుల మాటలు చూస్తుంటే తమ ఫోకస్ అంతే వైజాగ్ తప్ప మిగిలినవి పెద్ద ప్రయారిటీ కాదు అనే సంకేతాలు ఇస్తున్నట్లు స్పష్టం అవుతుంది. వైజాగ్ ఒక్కటే రాజధాని..మిగిలినవి ఉత్తుత్తి రాజధానులు...ఏదో ఒక్కటే అంటే కష్టం కాబట్టి ఆలా చెప్పినట్లు కనిపిస్తోంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

బుగ్గన వ్యాఖ్యల దుమారంపై సజ్జల బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలతో వికేంద్రీకరణ అవసరాన్ని గుర్తించి గతంలో మూడు రాజధానుల బిల్లు పెట్టామని, రాజధానుల వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానంలో నడుస్తోందన్నారు. తమ వాదన వినిపిస్తున్నామని, ప్రభుత్వం కోర్టులో వినిపిస్తున్న విషయాన్నే మంత్రి బుగ్గన చెప్పారన్నారు. మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి తేడా లేదని, మూడు రాజధానుల ఏర్పాటుపై ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కర లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అసెంబ్లీ అమరావతి లో ఉంటుందని.. హైకోర్టు కర్నూలు లో వస్తుందని.. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని గా ఉంటుందని సజ్జల పేర్కొన్నారు. వీటిని తాము మూడు కేపిటల్స్ అనే పిలుస్తామని అన్నారు. పరిపాలనను వికేంద్రీకరించాలనదే తమ ఉద్దేశమన్నారు. ప్రభుత్వం అసెంబ్లీలో, సుప్రీంకోర్టులో చెప్పే వాదనే ప్రధానమైందని అన్నారు. కొందరు కావాలనే రాజధానిపై గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story
Share it