మోహన్ బాబుతో పేర్ని నాని భేటీ
సినిమా చర్చల్లో కొత్త ట్విస్ట్. శుక్రవారం నాడు సీఎం జగన్ దగ్గరకు టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, అలీ పోసాని తదితరులు వెళ్లి సమస్యలపై చర్చించారు. ఈ టీమ్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ప్రెసిడెంట్ మంచు విష్ణు కానీ, సీనియర్ నటుడు మోహన్ బాబులకు చోటు దక్కలేదు. దీనిపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. కొద్ది రోజుల ముందు మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమ అంటే ఏ ఒక్కరిదో కాదని..అందరిదీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పరిశ్రమ సమస్యలను వాడుకోకూడదన్నారు. జగన్ తో భేటీ తర్వాత చిరంజీవితోపాటు తాడేపల్లిలో మాట్లాడిన వారంతా సమస్య పరిష్కారం అయిందని..సీఎం జగన్ స్పందన సానుకూలంగా ఉందని ప్రకటించారు.
ఈ తరుణంలో శుక్రవారం నాడు ఏపీ రవాణా, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని హైదరాబాద్ లోని మంచు మోహన్ బాబును ఆయన నివాసంలో కలిశారు. ఇందులో మంచు విష్ణు కూడా ఉన్నారు. మోహన్ బాబుతో బేటీ సందర్భంగా శుక్రవారం నాడు జరిగిన చర్చలు..సిని పరిశ్రమ అంశాలపై మాట్లాడినట్లు సమాచారం. ఇది ఆసక్తికర పరిణామంగా మారింది. ఇదిలా ఉంటే సినిమా టికెట్ల ధరలపై ఈ నెల 17న కమిటీ భేటీ సమావేశం జరగనుంది. ఈ మేరకు సభ్యులకు ఉన్నతాధికారులు సమాచారం పంపారు. ఈ భేటీలో సీఎం జగన్ తో చర్చల ఆధారంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.