Telugu Gateway
Andhra Pradesh

ఫిబ్రవరిలో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు

ఫిబ్రవరిలో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు
X

రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నందున స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రెడీ అవుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. ఎన్నికలకు రెడీ కావాలని ఆయన పార్టీలను కోరారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. కరోనా పరిస్థితిపై ఇప్పటికే రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పది వేల నుంచి 753 స్థాయికి వచ్చాయన్నారు. తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరుగుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేనందున వాటిని నిర్వహించే పనిలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో లేదని, పోలింగ్ కు నాలుగు వారాల ముందు మాత్రమే కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాజ్యాంగపర అవసరమే కాకుండా ఆర్ధిక సంఘం నిధులు తీసుకునేందుకు దోహదపడతాయని తెలిపారు. కరోనా పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. స్వేచ్చాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.ప్రభుత్వంతో చర్చించాక షెడ్యూల్ ను ఖరారు చేస్తామన్నారు.

Next Story
Share it