లిక్కర్ స్కాం లో 3113 కోట్ల కమీషన్లు!
గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ప్రధాన కారణాల్లో లిక్కర్ వ్యవహారం ఒకటి. ఈ విషయాన్ని వైసీపీ నాయకులు కొంత మంది మీడియా సాక్షిగా కూడా చెప్పారు. జగన్ ఐదేళ్ల కాలంలో గతంలో ఎన్నడూ లేని కొత్త కొత్త బ్రాండ్లు..నాసి రకం మందు తీసుకొచ్చి వైసీపీ సర్కార్ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. మరో వైపు ఎక్కడలేని విధంగా జగన్ తన పాలనలో కేవలం నగదు లావాదేవీల ద్వారానే మద్యం విక్రయాలు జరిగేలా చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన వైసీపీ సర్కార్ డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరించింది. ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ స్కాం పై విచారణకు ఆదేశించింది. దీనికి సంబంధించి సోమవారం నాడు కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికార కూటమిలో ప్రధాన పార్టీ అయిన టీడీపీ అధికారికంగా తన సోషల్ మీడియా పేజీ లో ఒక పోస్ట్ పెట్టింది. అదే ఇది.
‘రూ.2,500 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోల్చితే అంతకు 10 రెట్లు లిక్కర్ స్కామ్ ఏపీలో జరిగిందన్న విషయం పై ఇటీవల పార్లమెంటులో కూడా చర్చ జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీలో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దర్యాప్తులో కొత్త కంపెనీలు పెట్టించి, కమిషన్లు వసూలు చేయడం ద్వారా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రూ.3,113 కోట్లు కొల్లగొట్టినట్టు ప్రాధమికంగా తేలింది. ’ అని స్పష్టం చేసింది. ప్రాధమికంగానే స్కాం విలువ 3 ,113 కోట్లు అయితే...విచారం మొత్తం పూర్తి అయ్యే నాటికీ ఇది మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి ఈ స్కాం కు సంబంధించి ఏకంగా మూడు వేల కోట్ల రూపాయల పైన కమీషన్లు వసూలు చేసినట్లు తేల్చినందున ఇప్పుడు అయినా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ని అరెస్ట్ చేస్తారా...లేక ఇలా పేస్ బుక్ పేజీ లో పోస్ట్ వదిలేస్తారా అన్న చర్చ సాగుతుంది.
టీడీపీ అధికారికంగా పెట్టిన పోస్ట్ పై కూడా ఇదే తరహా కామెంట్స్ ఉండటం విశేషం. వచ్చిన కామెంట్స్ లో అన్ని కూడా టీడీపీ కి ..కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటం విశేషం. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. గతంలో కూడా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా సోషల్ మీడియా వేదికగా చాలా పోస్ట్ లు పెట్టి వదిలేసింది. రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తిన సమయంలో కృష్ణ బ్యారేజ్ ను కూల్చటానికి జగన్ మోహన్ రెడ్డి తో పాటు సజ్జల రామకృష్ణా రెడ్డి, తలశిల రఘురాంలు కుట్రలు చేశారు అంటూ వీళ్ళ ఫొటోలతో సహా పేస్ బుక్ లో పెట్టింది. ఇసుక బోట్ల ద్వారా కృష్ణ బ్యారేజ్ ను కులేచేందుకు కుట్ర చేశారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కానీ తర్వాత ఈ కేసు ఏమైందో ఎవరికి తెలియదు. అధికారంలో ఉన్న పార్టీ కుట్రలో జగన్ మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి ఉన్నారు అని చెప్పి...తర్వాత దాన్ని వదిలేయటం అంటే ఇది చాలా మందిని షాక్ కు గురి చేసింది అనే చెప్పాలి. అందుకే ఇప్పుడు మిథున్ రెడ్డి వ్యవహారంలో కూడా ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయకుండా..ఎందుకు ఇక్కడ పోస్ట్ లు పెడుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.