Telugu Gateway
Andhra Pradesh

బీజేపీ అనుమతి ఇస్తేనే టీడీపీ సర్కారు ముందుకు వెళుతుందా?

బీజేపీ అనుమతి ఇస్తేనే టీడీపీ సర్కారు ముందుకు వెళుతుందా?
X

ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన లిక్కర్ స్కాం గురించి నిజంగా కేంద్రంలోని బీజేపీ పెద్దలకు తెలియదా?. ఇంత కాలం తెలియకే ఈ కేసు గురించి సీరియస్ గా తీసుకోలేదు అని ఎవరైనా నమ్మితే అంతకు మించిన ఆత్మవంచన ఉండదు అనే చెప్పొచ్చు అని టీడీపీ నేతలే చెపుతున్నారు. ఎందుకంటే ఎన్నికలకు ముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న దగ్గుబాటి పురేందేశ్వరి ఏపీలో సాగుతున్న లిక్కర్ స్కాం పై హోమ్ మంత్రి అమిత్ షా కు పలు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అంతే కాదు...దీనిపై సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరారు కూడా. అయినా కేంద్రంలోని బీజేపీ సర్కారు నుంచి ఎలాంటి యాక్షన్ లేదు అన్న సంగతి తెలిసిందే. అంతే కాదు ఎన్నికల ముందు స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన బహిరంగ సభలోనే జగన్ సర్కార్ లిక్కర్ , ఇసుక, భూముల్లో స్కాములో చేస్తోంది అని అమిత్ షా ఆరోపించారు.

ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ హయాంలో సాగిన లిక్కర్ స్కాం పై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం( ఎస్ఐటి) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల లోక్ సభలో టీడీపీ పార్లమెంటరీ నాయకుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ఐదేళ్ల పాలనా కాలంలో దగ్గర దగ్గర లక్ష కోట్ల రూపాయల మద్యం వ్యాపారం సాగితే ఇందులో ఏకంగా 18000 కోట్లు దుర్వినియోగం అయ్యాయి అని...మరో నాలుగు వేల కోట్ల రూపాయలు దేశం దాటించారు అని ఆరోపించారు. సునీల్ రెడ్డి ఒక్కరే రెండు వేల కోట్ల రూపాయలు దుబాయ్ కి తరలించారు అని ఆరోపిస్తూ...దీనిపై ఈడీ తో విచారణ జరిపించాలని కోరారు. లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్ సభలో ఈ విషయాలను ప్రస్తావించిన తర్వాత హోమ్ మంత్రి అమిత్ షా తో సమావేశం అయి దీనికి సంబదించిన రికార్డు లు అందచేసినట్లు మీడియా లో వార్తలు వచ్చాయి.

అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణలో డబ్బు లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు కూడా లభించినట్లు ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. అంతే కాదు కొద్ది రోజుల క్రితం టీడీపీ తన అధికారిక పేస్ బుక్ పేజీ లో కొత్త కంపెనీలు పెట్టించి, కమిషన్లు వసూలు చేయడం ద్వారా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈ లిక్కర్ స్కాం లో 3,113 కోట్లు కొల్లగొట్టినట్టు ప్రాధమికంగా తేలింది అని పోస్ట్ పెట్టింది. అయితే తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టు ను ఆశ్రయించిన మిథున్ రెడ్డి కి తాజాగా ఊరట లభించింది. ఏప్రిల్ మూడు వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దు అని ఏపీ హై కోర్టు ఆదేశించింది. అయితే ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే సిట్ విచారణలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతి లభిస్తే కానీ...టీడీపీ సారథ్యంలోని కూటమి సర్కారు ముందుకు పోలేదా అన్న చర్చ టీడీపీ వర్గాల్లో కూడా సాగుతోంది. అయితే ఈ లిక్కర్ స్కాం లో ఎంపీ మిథున్ రెడ్డి తో పాటు మొత్తం నలుగురు కీలక వ్యక్తులుగా తేలారు అని..ఇందులో ఒకరు మాజీ ఎంపీ అయితే ..మరొకరు మాజీ సలహాదారు తో పాటు జగన్ ఫ్యామిలీ కి చెందిన కంపెనీ డైరెక్టర్ మరొకరు ఉన్నారు అని ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. ఈ సెగ నేరుగా జగన్ ను తాకుతుందా లేదా అన్నది ఇంకా బయటకు రావాల్సి ఉంది. ప్రతి నెల కోట్ల రూపాయల్లో జరిగిన లిక్కర్ వ్యాపారంలో మొత్తం నగదు మాత్రమే తీసుకోవటం వెనకే పెద్ద గోల్ మాల్ ఉంది అనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి.

Next Story
Share it