ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి అరెస్ట్

ఏపీ లిక్కర్ స్కాం లో కీలక పరిణామం. ఈ కేసు ను దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు శుక్రవారం సాయంత్రం మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి తో పాటు జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణ మోహన్ రెడ్డి ని అరెస్ట్ చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ధనుంజయ రెడ్డి అత్యంత కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. బిల్స్ చెల్లింపు దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ధనుంజ రెడ్డి జోక్యం ఉంది అంటూ గతంలో స్వయంగా వైసీపీ ఎమ్మెల్యేలే ఆరోపించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ధనుంజయ రెడ్డి అన్ని విషయాల్లో అత్యంత కీలకంగా వ్యవహరించారు అనే విషయం ఆ పార్టీ నాయకులూ కూడా చెపుతారు. వైసీపీ హయాంలో లిక్కర్ వ్యాపారం మొత్తం నగదు రూపేనా సాగిన విషయం తెలిసిందే. ఈ నగదులో ముడుపుల వాటాను ప్రతినెలా పెద్దలకు చేర్చే వాళ్ళు అని...ఇందులో ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉంది అని సిట్ ఆరోపిస్తోంది. అందులో భాగంగానే వీళ్ళను ఈ కేసు లో ఏ 31 , ఏ 32 లుగా చేర్చిన విషయం తెలిసిందే. ఏ 33 గా ఉన్న బాలాజీ గోవిందప్ప భారతి సిమెంట్స్ హోల్ టైం డైరెక్టర్ గా ఉన్నారు.
ఇప్పటికే సిట్ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు నగదు తరలింపు వ్యవర్మలో కీలక పాత్రధారులుగా ప్రచారంలో ఉన్న ముగ్గురు కూడా అరెస్ట్ కావటంతో లిక్కర్ స్కాం డబ్బు ఎక్కడెక్కడకు..ఎలా వెళ్ళింది అనే గుట్టువిప్పుతారా..అసలు బాస్ రహస్యాలు బయటపెడతారా అన్నది ఇప్పుడు వైసీపీ నేతల్లో గుబులు రేపుతున్న అంశం. ఏపీ లిక్కర్ స్కాం లో దగ్గర దగ్గర 3500 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సిట్ గుర్తించింది అని టీడీపీ అధికారికంగా చెపుతూ వస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు ఈ ముగ్గురు చెప్పే విషయాలే అత్యంత కీలకం అనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు .ఈ లావాదేవీలు అన్ని నగదు రూపంలో జరిగినందున ఇందులో అంతిమ లబ్దిదారుడిని గుర్తించి ఫిక్స్ చేయటమే విచారణ సంస్థల ముందు ఉన్న అతి పెద్ద సవాల్ గా ఒక అధికారి అభిప్రాయపడ్డారు.



