Telugu Gateway
Andhra Pradesh

ఎన్నికల అస్త్రాలుగా మారిన అంశాలు

ఎన్నికల అస్త్రాలుగా మారిన అంశాలు
X

ప్రజల వ్యతిరేకతతో వణుకుతున్న వైసీపీ అభ్యర్థులు!

తెలంగాణ రాజకీయాల్లో ధరణి రేపిన దుమారం అంతా ఇంతా కాదు. గత ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. ధరణి తో తెలంగాణాలో చాలా చోట్ల భూమికి సంబంధించిన అంశాలు పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకున్నాయి. భూ హక్కుదారులకు కొంత మంది అధికారులు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. కొంత మంది అధికారులు కావాలని రికార్డుల్లో తప్పులు నమోదు చేసి...వాటిని సవరించడానికి కూడా భారీ ఎత్తున డబ్బు వసూళ్లకు పాల్పడినట్లు అప్పట్లో రైతులు గగ్గోలు పెట్టారు. తెలంగాణాలో ఇప్పటికి పరిష్కారం కానీ ధరణి కేసు లు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇది ఒక సమస్య అయితే ధరణి ని అడ్డం పెట్టుకుని అధికారంలో ఉన్న పెద్దలు ప్రభుత్వ భూములు...ఎవరూ క్లెయిమ్ చేయని భూములు..వివాదాల్లో ఉన్న వాటిని సెటిల్ చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. కొన్ని ఆధారాలతో సహా బయటపడ్డాయి. ధరణిని అడ్డం పెట్టుకుని లబ్ది పొందిన వారిలో గత ప్రభుత్వ పెద్దలతో పాటు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ సర్కారు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ఎలా గట్టిగా సమర్ధించుకుంటుందో...అంత కంటే గట్టిగానే మాజీ సీఎం కెసిఆర్ ధరణి ని సమర్ధించుకున్న విషయం తెలిసిందే. ఒక సారి ధరణిలో ఎక్కిన తర్వాత సీఎం కూడా ఏమీ చేయలేరు అంటూ అయన ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఇదే అంశంపై కెసిఆర్ ఎన్నికల ప్రచారంలో ప్రతి బహిరంగ సభలో ఎంత మొత్తుకున్నా కూడా బాధిత ప్రజలు వాటిని పట్టించుకోలేదు అనే విషయం ఫలితాలు చూసిన వాళ్లకు ఎవరికైనా అర్ధం అవుతుంది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది అని...మోడీ సర్కారు ఆమోదించింది అని ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార వైసీపీ నేతలు చెపుతున్నారు. సీఎం జగన్ దగ్గర నుంచి మంత్రుల అందరూ ఇప్పుడు అదే పని చేస్తున్నారు. అయితే అత్యంత కీలకమైన భూమి విషయంలో ఎవరు చికాకులు సృష్టించినా..అనుమానాలు కలిగేలా చట్టాలను తెచ్చినా వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అనే అభిప్రాయం ఉంది. ఇప్పటికే వైసీపీ వివిధ అంశాల్లో ప్రజల నుంచి తీవ్రంగా వ్యతిరేకత ఎదుర్కొంటోంది.

ఇవి సరిపోవు అన్నట్లు ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ చట్టం అంశాన్ని తెరమీదకు తెచ్చి జగన్ తమను ఇరకాటంలోకి నెడుతున్నారు అని వైసీపీ అభ్యర్థులు కొంత మంది వాపోతున్నారు. ఈ వివాదాస్పద చట్టం అంశాన్ని ఎన్నికల ఇష్యూగా చేయటంలో టీడీపీ, జన సేన లు విజయవంతం అయ్యాయనే చెప్పాలి. అంతే కాదు..తాము అధికారంలోకి వస్తే వెంటనే దీన్ని రద్దు చేస్తామని కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెపుతున్నారు. ఈ అంశానికి సంబంధించి జన సేన సినిమా నటుడు పృద్వి తో చేసిన వీడియో వైరల్ గా మారటమే కాకుండా...ఈ చట్టం అమల్లోకి వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో చూపించే ప్రయత్నం చేసింది. కేంద్రంలోని మోడీ సర్కారు కు ఆంధ్ర ప్రదేశ్ ఒక ప్రయోగశాలగా మారింది అని ఒక అధికారి వ్యాఖ్యానించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల విధానం తో పాటు ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ సర్కారు తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని కూడా వైసీపీ సర్కారు అమలుకు పూనుకోవటం అందులో భాగమే అని చెపుతున్నారు.

Next Story
Share it