కోట్లు పెట్టి జాకెట్ యాడ్స్ ..ఉద్యోగుల ఫోన్ల బిల్లులు కట్టని సమాచార శాఖ!

సర్కారు పరువు పాయె
ఏపీ సర్కారు మాట్లాడితే కోట్ల రూపాయల యాడ్స్ ఇస్తుంది. కానీ ఆ యాడ్స్ ఇచ్చే సమాచార శాఖ ఉద్యోగుల ఫోన్ల బిల్లులు కూడా కట్టలేదు. దీంతో అత్యంత కీలకమైన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పలితాలు వెలువడుతున్న రోజు సమాచార శాఖ ఉద్యోగుల ఫోన్లు అన్నీ మూగబోయాయి. విషయం ఆరా తీస్తే బిల్లులు కట్టని కారణంగా సర్వీస్ ప్రొవెడర్లు కనెక్షన్ లు కట్ చేశారని తేలింది. దీంతో సమాచారం కోసం మీడియా ప్రతినిధులు ఎవరినో కాంటాక్ట్ చేయాలో తెలియక నానా ఇబ్బంది పడాల్సి వచ్చింది. విషయం చికాకు అవుతుండటంతో సమాచార శాఖకు చెందిన జాయింట్ డైరక్టర్ కస్తూరి తమ ఉద్యోగుల వ్యక్తిగత నెంబర్ల వివరాలతో కూడిన ఈ షీట్ ను మీడియా గ్రూపుల్లో పెట్టారు. సమాచారం కోసం ఈ నెంబర్లకు కాంటాక్ట్ చేయాలన్నారు. అంటే సర్కారు పనికి సమాచార శాఖ ఉద్యోగుల సొంత ఫోన్లు వాడుకోవాల్సిన పరిస్థితి. గత చంద్రబాబు ప్రభుత్వంతో పోలిస్తే యాడ్స్ మంజూరు విషయంలో జగన్ సర్కారు కొత్త రికార్డులు నెలకొల్పుతోంది.
అది అప్పటికే అమల్లో ఉన్న పథకం అయినా...వాయిదాల చెల్లింపులకు అయినా పేజీలకు పేజీలు జాకెట్ యాడ్స్ ఇస్తూ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. చివరకు అత్యంత రొటీన్ గా సాగే పారిశ్రామిక రాయితీల చెల్లింపులకు కూడా ఫుల్ పేజీ జాకెట్ యాడ్స్ ఇచ్చిన చరిత్ర ఏపీ సర్కారుదే. ప్రతి నెలా ఏదో ఒక పథకం కింద డబ్బులు చెల్లించేలా చూడటం...ఆ పేరుతో కోట్లాది రూపాయల ప్రభుత్వ దనంతో ప్రకటనలు జారీ చేయటం. అధికారంలో ఉన్నాం మా ఇష్టం అంటారా? ఓకే అనుకుందాం. మరి అంత ఖర్చు పెడుతున్న సమాచార శాఖ సొంత ఉద్యోగుల ఫోన్ బిల్లులు ఎందుకు కట్టలేకపోయింది. ఏకంగా సర్వీస్ ప్రొవెడర్లు కనెక్షన్లు కట్ చేసే వరకూ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంది. ఇదీ ఇప్పుడు కొత్త చర్చ.అది కూడా అత్యంత కీలకమైన ఎన్నికల ఫలితాల రోజున. సమాచార శాఖకు చెందిన ఉద్యోగులు అందరి అధికారిక నెంబర్లకు ఫోన్లు చేస్తే తాత్కాలికంగా ఈ నెంబర్లు అందుబాటులో లేవని సమాధానం వస్తోంది.