Telugu Gateway
Andhra Pradesh

స్మగ్లర్ కారు ఐఏఎస్ లు ఇంటికి పంపుతారా?

స్మగ్లర్ కారు ఐఏఎస్ లు ఇంటికి పంపుతారా?
X

నెలకు లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటున్నా కొంత మంది ఐఏఎస్ అధికారులు కక్కుర్తి పనులు చేస్తుంటారు. వాళ్ళు చేసే అవినీతి సంగతి కాసేపు పక్కన పెట్టినా కూడా...అనధికారింగా వాళ్ళు చేసే పనులు మాత్రం కొన్ని సార్లు షాక్ కు గురి చేస్తుంటాయి. అలాంటిదే ఈ వ్యవహారం కూడా. ఆ ఐఏఎస్ అధికారి ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత కీలకమైన అంటే కీలక స్థానంలో ఉన్నారు. తెలంగాణాలో పని చేసినప్పుడు ఆయన పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. తర్వాత ఆంధ్ర ప్రదేశ్ కు వెళ్లిపోయారు. అసలు విషయం ఏమిటి అంటే ఆంధ్ర ప్రదేశ్ లోని అటవీ శాఖ కు చెందిన అధికారులు ఎర్ర చందనం స్మగ్లింగ్ విషయంలో ఒక బిఎండబ్ల్యూ కారు ను సీజ్ చేశారు. ఆ దొంగ ఎవరో ఖరీదు అయిన బిఎండబ్ల్యూ కారు లో అయితే ఎవరూ చూడరు అనుకున్నాడో ఏమో ఈ ప్లాన్ వేశాడు. అయితే సీజ్ చేసిన కారు విషయంలో నిబంధనలు పాటించాల్సిన అధికారులు అవేమి చేయకుండా బాస్ మెప్పు పొందేందుకు ఈ ఖరీదు అయిన కారు ను సదరు ఐఏఎస్ అధికారి కి అప్పగించారు.

ఇప్పుడు ఆ కాస్ట్ లీ బిఎండబ్ల్యూ కారు ను ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత కీలకమైన స్థానంలో ఉన్న ఐఏఎస్ అధికారి భార్య ఇప్పుడు హైదరాబాద్ లో ఎంచక్కా వాడుకుంటున్నారు. ఫంక్షన్స్ తో పాటు ఏ కార్యక్రమానికి అయినా ఆమె ఇదే కారు లో షికారు చేస్తున్నారు. ఇదే ఇప్పుడు హైదరాబాద్ లోని ఐఏఎస్ సర్కిల్స్ తో పాటు అధికారుల ఫ్యామిలీల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. కీలక స్థానంలో ఉన్న ఆయన ఇలా సీజ్ వేసిన వాహనాన్ని తీసుకొచ్చి భార్యకు అప్పగించటం ఏమిటో అన్న చర్చ సాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ లోని మంచి ప్రభుత్వం ఇలాంటి వాటిని పట్టించుకునే పనిలో లేదు అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇలా స్మగ్లర్ల కారు వాడుతున్న వాళ్ళ నుంచి ప్రభుత్వం ఎలాంటి నిజాయతీతో పని ఆశిస్తుందో...వాళ్ళు ఎంత గొప్పగా ప్రభుత్వానికి, ప్రజలకు సేవలు అందించగలరో ఊహించుకోవచ్చు.

Next Story
Share it