భోగాపురం ఎయిర్ పోర్డు రోడ్డుకు అడ్డంపడుతున్న ఐఏఎస్!

సహజంగా ఐఏఎస్ అధికారులు అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా చూడాలి. ఎక్కడైనా అడ్డంకులు ఉంటే వాటిని తొలగించేందుకు పని చేయాలి. కానీ అవి పాత రోజులు. ప్రభుత్వ, ప్రజా ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యమైన ఈ తరుణంలో ఆయన కూడా తన ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే ఏపీ ప్రభుత్వం తలపెట్టిన విశాఖపట్నం-భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానించే ఆరు లైన్ల రోడ్డు పనులు దాదాపు ఏడాది కాలంగా అడుగు ముందుకు సాగటం లేదు. రాష్ట్రంలో ఏ కీలక ప్రాజెక్టు వస్తుంది..అది ఎలా వెళుతుంది అన్నది కేబినెట్ మంత్రుల తర్వాత తెలిసేది ఐఏఎస్ అధికారులకే. కొంత మంది అధికారులు తమ అక్రమార్జనకు దీన్ని ఓ అస్త్రంగా వాడుకుంటున్నారు. ప్రభుత్వంలోని కొంత మంది కీలక నేతలు కూడా ఇదే పని చేస్తుండటంతో తాము ఎందుకు ఈ పని చేయకూడదన్నట్లు వారు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. వందల కోట్ల రూపాయలు దండుకునేందుకు ఈ కీలక సమాచారాన్ని వాడుకుంటున్నారు. ఆయన కథే ఇది. ఏపీ ప్రభుత్వంలో ఆయనో సీనియర్ ఐఏఎస్ అధికారి. వైజాగ్ తో మంచి సంబంధాలు..అనుబంధాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకునే అక్కడ వందల ఎకరాల భూములను కొనుగోలు చేశారు. అది కూడా బినామీ పేర్లతో. సరిగ్గా తన భూముల పక్క నుంచే కొత్తగా డెవలప్ చేయనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆరు లైన్ల రోడ్డు వెళ్లేలా చూసుకున్నారు.
కానీ మధ్యలో హఠాత్తుగా ఓ ప్రత్యామ్నాయ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అది ఢిల్లీకి చేరింది. అంతే సదరు ఐఏఎస్ వెంటనే రంగంలోకి దిగి కొత్త ప్రతిపాదన వల్ల ఎన్ని సమస్యలు ఉన్నాయో వివరిస్తూ కేంద్రానికి నివేదిక పంపారు. వాస్తవానికి ఆయనకు..ఈ శాఖకు నేరుగా సంబంధం లేదు. అయినా సరే భద్రతా ప్రమాణాలు..ప్రజా ప్రయోజనాలు అన్న తరహాలో ఈ పని కానిచ్చేశారు. కానీ అసలు దీని వెనక ఉన్నది తన స్వప్రయోజనాలు అన్న విషయాన్ని మాత్రం బయటకు సహజంగానే చెప్పరు కదా. కారణాలైమేనా జగన్ సీఎం అయిన తర్వాత భోగాపురం విమానాశ్రయం పనులు ముందుకు సాగటం లేదు..చివరకు రోడ్డు పనులు కూడా ప్రారంభం కావటం లేదు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు చంద్రబాబు హయాంలోనే ప్రారంభం కావాల్సి ఉన్నా దీని చుట్టూ పలు వివాదాలు చుట్టుముట్టాయి. ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. కానీ అధికారంలోకి వచ్చాక మాత్రం చంద్రబాబు హయాంలో ఈ విమానాశ్రయానికి ఇచ్చిన భూమిలో ఓ ఐదు వందల ఎకరాలు తగ్గించి తామేదో గొప్పగా చేసుకున్నట్లు కలరింగ్ ఇచ్చారు. అసలు సమస్య అంతా టెండరింగ్ విధానంపైనే..యూడీఎఫ్ వసూలు తదితర అంశాలపై అయితే..జగన్ మాత్రం భూమి తగ్గించి ఏదో మార్పులు చేశామన్నట్లు వ్యవహరించిన విషయం తెలిసిందే.