Telugu Gateway
Andhra Pradesh

ఏపీ సర్కారుకు హైకోర్టు షాక్..ఎస్ఈసీ నిర్ణయంలో జోక్యానికి నో

ఏపీ సర్కారుకు హైకోర్టు షాక్..ఎస్ఈసీ నిర్ణయంలో జోక్యానికి నో
X

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఇప్పట్లో ఎన్నికలు పెట్టడం సాధ్యంకాదనే వాదనతో ఏపీ సర్కారు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఇదే అంశంపై ఎస్ఈసీ, సీఎస్ ల మధ్య లేఖల యుద్ధం నడించింది. ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ లకు కూడా సర్కారు నో చెప్పింది. తాజాగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలన్న ఎస్ఈసీ నిర్ణయాన్ని నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఏపీ సర్కారు హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వ పిటిషన్‌పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. హైకోర్టు నిర్ణయం ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ లాయర్ అశ్వనీ కుమార్ చెప్పారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఏపీ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తాము అమలు జరపలేమని చెప్పి ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాదితోపాటు ఈసీ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ శుక్రవారం నాటికి వాయిదా వేసింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోలీసులు కరోనా బారిన పడ్డారని..ఆరు వేల మందికిపైగా మృత్యువాత పడ్డారని తెలిపారు. అంతే కాకుండా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకునే ఎన్నికలు నిర్వహించాలనే ఎస్ఈసీకి సూచించినా ఆయన ఆ సూచనను పట్టించుకోవటంలేదని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ అంశంపై శుక్రవారం నాడు మరోసారి విచారణ జరగనుంది.

Next Story
Share it