Telugu Gateway
Andhra Pradesh

ఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టు స్టే

ఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టు స్టే
X

రెండు రోజుల్లో ఎన్నికలు జరగాల్సిన తరుణంలో ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ఎస్ఈసీ నీలం సాహ్ని విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల8న ఎన్నికలు..10న ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈ తరుణంలో హైకోర్టు ఎన్నికలకు బ్రేక్ వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదని హైకోర్టు పేర్కొంది. ఈ నెల 1న ఎస్ఈసీ జారీచేసిన నోటిఫికేషన్ లో తదనంతర చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశం ఇచ్చింది. నోటిఫికేషన్, పోలింగ్‌కు మధ్య 4 వారాల సమయం ఉండాలన్న సుప్రీంకోర్టు నిబంధనను పాటించలేదని తెలిపారు.

15న ఈ అంశంపై అపిడవిట్ వేయాలని ఎస్ఈసీ ని హైకోర్టు ఆదేశించింది. అసలు కోడ్ అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్లటం ఏ మాత్రం సరికాదని పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించి ఎస్ఈసీ ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసింది. తెలుగుదేశం పార్టీ దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంత వేగంగా పరిషత్ ఎన్నికలను పూర్తి చేసుకుని వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ఫోకస్ పెట్టాలని యోచిస్తోంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోపాటు మంత్రులు కూడా బహిరంగంగా వ్యక్తం చేశారు. సహజంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత ఎన్నికల విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవనే విషయం గతంలో పలు సందర్భాల్లో వ్యాఖ్యానించింది. అయితే ఈ సారి ఏకంగా రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో హైకోర్టు ఈ ఆదేశాలు ఇవ్వటం కీలకంగా మారింది.

Next Story
Share it