Telugu Gateway
Andhra Pradesh

సీఐడీ విచారణపై హైకోర్టు స్టే..చంద్రబాబుకు ఊరట

సీఐడీ విచారణపై హైకోర్టు స్టే..చంద్రబాబుకు ఊరట
X

అమరావతి లో అసైన్ మెంట్ భూ అక్రమాలకు సంబంధించి సీఐడీ నమోదు చేసిన కేసుపై హైకోర్టు స్టే విధించింది. దీంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి నారాయణలకు ఊరట లభించింది. సీఐడీ నోటీసుల ప్రకారం చంద్రబాబు ఈ నెల 23న సీఐడీ ముందు హాజరు కావాల్సి ఉంది. నారాయణకు మార్చి22న రావాలని నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు స్టేతో వీరిద్దరూ ఇప్పుడు విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేకుండా పోయింది. సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు, నారాయణలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలసిందే. దీనిపై విచారణ జరిపిన కోర్టు శుక్రవారం నాడు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, నారాయణ తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్‌లు వాదించారు.

ప్రభుత్వం తరపున అడిషనల్‌ ఏజీ జాస్తి నాగభూషణం వాదనలు వినిపించారు. చంద్రబాబు, నారాయణపై కేసులో.. స్పష్టమైన ఆధారాలు ఉంటే చూపించాలని సీఐడీని న్యాయమూర్తి కోరారు. ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని న్యాయస్థానం ప్రశ్నించింది. విచారణ తొలి దశలో వివరాలు చెప్పలేమని సీఐడీ అధికారులు కోర్టు దృష్టికి తెచ్చారు. పూర్తి స్థాయి విచారణకు అనుమతి ఇస్తే అన్ని విషయాలు తెలుస్తాయని సీఐడీ అధికారులు కోర్టుకు తెలిపారు. రాజకీయ దురుద్దేశంతోనే ప్రభుత్వం ఈ కేసు నమోదు చేసిందని..చంద్రబాబుకు, నారాయణలకు ఈ వ్యవహారంలో ఎలాంటి పాత్ర లేదని వారి న్యాయవాదులు కోర్టు ముందు వాదనలు విన్పించారు. ఏదైనా తప్పు జరిగితే ముందు అధికారులపై కేసులు పెట్టాలని ..అలాంటిది ఏమీ లేకుండా మాజీ ముఖ్యమంత్రి, అప్పటి మంత్రులపై కేసులు పెట్టడం సరికాదన్నారు. ఫిర్యాదులో ఉన్న ఆరోపణలకు పెట్టిన సెక్షన్లకు ఏ మాత్రం సంబంధం లేదన్నారు.

Next Story
Share it