Telugu Gateway
Andhra Pradesh

ఉద్యోగుల వేత‌నాల్లో రిక‌వ‌రీ వ‌ద్దు

ఉద్యోగుల వేత‌నాల్లో రిక‌వ‌రీ వ‌ద్దు
X

ఏపీలోని ప్ర‌భుత్వ ఉద్యోగులకు ఊర‌ట‌. నూత‌న పీఆర్సీ ప్ర‌కారం జారీ చేసిన కొత్త జీవోలకు అనుగుణంగా ఉద్యోగుల జీతం నుంచి ఎలాంటి రిక‌వ‌రిలు చేయ‌వ‌ద్ద‌ని హైకోర్టు మ‌ధ్యంత‌ర ఆదేశాలు జారీ చేసింది. పీఆర్సీలో ఇచ్చిన 23 శాతం ఫిట్ మెంట్ కంటే గ‌తంలో ఇచ్చిన ఐఆర్ 27 శాతం ఉండ‌టంతో చాలా మంది ఉద్యోగులు డ‌బ్బు స‌ర్కారుకు వెన‌క్కి క‌ట్టాల్సి వస్తుంద‌ని లెక్క‌లేశారు. దీంతో పాటు హెచ్ఆర్ఏ శ్లాబుల్లో కూడా మార్పులు చేశారు. దీనిపై వివాదం త‌లెత్తిన త‌ర్వాత స‌ర్కారు మ‌ళ్ళీ మార్పులు చేసింది. అయితే కొత్త పీఆర్సీ ప్ర‌కారం ఉద్యోగుల‌కు జీతాలు తగ్గాయని, ఇది విభ‌జ‌న చ‌ట్టానికి వ్య‌తిరేకం అంటూ హైకోర్టులో గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ పిటీష‌న్ పై విచారించిన హైకోర్టు ఎలాంటి కోత‌లు లేకుండానే ఉద్యోగుల‌కు వేత‌నాలు ఇవ్వాల‌ని ఆదేశించింది. ఈ అంశంపై మూడు వారాల్లో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల్సిందిగా ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. పీఆర్సీపై నియమించిన ఆశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక ఇంత వ‌ర‌కూ ఉద్యోగ సంఘాల‌కు ఇవ్వలేదని పిటీష‌న‌ర్ త‌ర‌పు న్యాయవాది రవితేజ వాదనలు వినిపించారు. ఈకేసులో ప‌లు అంశాలు ముడిప‌డి ఉండ‌టంతో త‌దుప‌రి విచారణను ఫిబ్రవరి 23కు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే ప్ర‌భుత్వం స‌మ్మెను నివారించేందుకు వీలుగా ఉద్యోగ సంఘం నేత‌ల‌ను మంగ‌ళ‌వారం నాడు చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించింది.

Next Story
Share it