Telugu Gateway
Andhra Pradesh

జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల కౌంటింగ్ కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్

జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల కౌంటింగ్ కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్
X

అభ్య‌ర్ధుల టెన్ష‌న్ వీడింది. ఎన్నిక‌లు ముగిసి..నెల‌లు గ‌డిచినా ఇంత వ‌ర‌కూ ఫ‌లితాలు రాలేదు. హైకోర్టు సింగిల్ బెంచ్ అస‌లు ఎన్నిక‌లే చెల్ల‌వు అన్న‌ది. కొత్త‌గా ఎన్నిక‌లు పెట్టాలంది. దీనిపై ఎస్ఈసీ డివిజ‌న్ బెంచ్ లో అప్పీల్ చేసింది. ఇక్క‌డ ఎస్ఈసీకి ఊర‌ట ల‌భించింది. ఇప్ప‌టికే పూర్త‌యిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పును హైకోర్టు కొట్టేసింది. కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించుకోవచ్చని డివిజన్‌ బెంచ్‌ తెలిపింది. గురువారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఈ మేర‌కు తీర్పు ఇచ్చింది.

ఈ ఏడాది ఏప్రిల్‌ 8న 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీలకు ఎన్నికలు జ‌రిగిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 10న కౌంటింగ్ నిర్వహించాల్సి ఉండగా హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులతో వాయిదా పడింది. మళ్లీ ఎన్నికలు నిర్వహించడం ఈ పరిస్థితులలో అసాధ్యంతో పాటు కోట్లాది రూపాయిలు వృధా అవుతాయని ఎస్‌ఈసీ త‌న పిటీష‌న్ లో పేర్కొంది. గురువారం నాడు హైకోర్టు.. కౌంటింగ్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో న్యాయ పరమైన చిక్కులు తొలిగాయి. దీంతో కౌంటింగ్ ప్రక్రియకు ఎస్‌ఈసీ కసరత్తు ప్రారంభించింది. ఫ‌లితాల కోసం ఎదురుచూస్తున్న అభ్య‌ర్ధుల‌కు పెద్ద ఊర‌ట ల‌భించిన‌ట్లు అయింది.

Next Story
Share it