అమరావతి రైతుల 45 రోజుల పాదయాత్ర

రాజధానికి భూములు ఇచ్చిన రైతుల ఉద్యమం ఆగటం లేదు. ప్రభుత్వ తీరుకు నిరసనగా వీరు నవంబర్ 1 నుంచి 45 రోజుల పాటు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ మహాపాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. శాంతి భద్రతల సమస్యలు వచ్చే అవకాశం ఉందని..అందుకే ఈ పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమని ఏపీ డీజీపీ తెలిపారు. దీనిపై అమరావతి జెఏసీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టు షరతులతో ఈ పాదయాత్రకు అనుమతి మంజూరు చేసింది. పాదయాత్రకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.
అయితే పోలీసులు అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో సహేతుకమైన కారణాలు లేవని అమరావతి జెఏసీ తరపున వాదనలు విన్పించిన న్యాయవాది వివరించారు. పాదయాత్రకు అనుమతిస్తే అభ్యంతరం ఏమిటని ప్రశ్నించిన హైకోర్టు..షరతులతో అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చింది. రైతుల పాదయాత్రపై గ్రామాల్లో రాళ్లు వేసే ప్రమాదం ఉందని ప్రభుత్వ న్యాయవాది ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేసుకుంటారని అమరావతి రైతుల తరపు న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు.