స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ప్రతిపాదనలకే ఆమోదం లభించేలా కన్పిస్తోంది. దీనికి సంబంధించి ఏపీ హైకోర్టు బుధవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నియమించిన ముగ్గురు అధికారులతో కూడిన కమిటీ ఎస్ఈసీని కలవాలని హైకోర్టు సూచించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కోరింది. కరోనా పరిస్థితులను మదింపు చేసి ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటుందని, అధికారుల బృందం ఎస్ఈసీతో చర్చించిన అంశాలను కోర్టుకు తెలపాలని కోరింది.
డిసెంబర్ 29న దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది. జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు ఏ మాత్రం ఆసక్తి చూపటం లేదు. సర్కారుతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైఖరి కూడా ఇందుకు ఓ ప్రధాన కారణమే. రాష్ట్ర మంత్రులు అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తాజా పరిస్థితుల్లో హైకోర్టు ఆదేశాలు కీలకంగా మారాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించింది.