రాజధాని తీర్పులో హైకోర్టు పరిధి దాటింది

అసెంబ్లీలో సీఎం జగన్
ఏపీ అసెంబ్లీలో గురువారం నాడు మూడు రాజధానుల అంశంపై చర్చ జరిగింది. ఇందులో ప్రధానంగా ఇటీవల రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా చర్చ సాగింది. ఈ చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని తీర్పు సందర్భంగా హైకోర్టు తన పరిధి దాటినట్లు అన్పించిందన్నారు. సభలో మనందరి మనోభావాలు ఇవేనన్నారు. రాజ్యాంగం ప్రకారం శాసనాలు చేసే అధికారం శాసనసభ, లోక్ సభలకే ఉంటుందని, తాము చేసిన చట్టాలు సరైనవా ..కావా అన్నది ఐదేళ్లకు ఓ సారి ప్రజల దగ్గరకు వెళ్లి తీర్పు తీసుకోంటామన్నారు. లక్ష కోట్లతో అది చేయండి..ఐదు లక్షల కోట్లతో ఇది చేయండి అంటూ కోర్టులు ఎలా చెబుతాయని, డెడ్ లైన్లు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఆచరణ సాధ్యం కాని తీర్పులు ఉండదకూడదని, సుప్రీంకోర్టు చెప్పిందని, కానీ హైకోర్టు అలా తీర్పు అలాగే ఉందన్నారు. శాసనసభ అధికారాలను హరించేలా హైకోర్టు తీర్పు ఉందన్నారు. రాజధాని అంశంలో నిర్ణయం సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారమే అంటూ కేంద్రం అఫిడవిట్ రూపంలో హైకోర్టులో దాఖలు చేసింది. అయినా కూడా కోర్టు హైకోర్టుకు రాజధానిపై చట్టం చేసే అధికారం లేదనటం సరికాదన్నారు. శాసన వ్యవస్థ చట్టాలు చేయాలా వద్దా అన్నది కోర్టులు నిర్ణయించలేవని జగన్ స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పుపై న్యాయసలహా తీసుకుంటామని..అదే సమయంలో మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు.
అన్ని వ్యవస్థలు వాటి పరిధిలో ఉండాలి. లేకపోతే సిస్టమ్ కుప్పకూలుతుందన్నారు. కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం రాజధాని విషయంలో ముందుకు వెళ్ళటానికి వీల్లేదని హైకోర్టు చెప్పిందన్నారు. రాజధాని నిర్ణయం రాష్ట్రాల హక్కేనని..ఇందులో కేంద్రం పాత్రేమీలేదని పార్లమెంట్ లో కూడా స్పష్టంగా కేంద్రం స్పష్టంగా చెప్పిందని జగన్ గుర్తు చేశారు. అయినా హైకోర్టు ఇలా చెప్పటం ఎంత వరకూ సమంజసం ఆలోచించాలని కోరుతున్నా. హైకోర్టు అంటే తమకు ఎంతో గౌరవం ఉందని..వారిని అగౌరవ పర్చటానికి ఇలా చేయటం లేదన్నారు. అదే సమయంలో రాష్ట్ర శాసనసభకు ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత లెజిస్లేచర్ కకు ఉందన్నారు. ఇది మనతో ఆగిపోదు..ఇది ఎప్పటి నుంచో అమల్లో ఉందని తెలిపారు. ఓటు ద్వారా ప్రజలు ఎన్నుకుంటే ఇక్కడకు వచ్చాం. మన గౌరవాన్ని మనం కాపాడుకోకపోతే..మనం ప్రశ్నించకపోతే లెజిస్లేచర్ కు అర్ధం లేకుండా పోతుంది. లేకపోతే చట్టాలు అసెంబ్లీ చేస్తుందా.. కోర్టులు చేస్తాయా అన్న గందరగోళం వస్తుందన్నారు. న్యాయస్థానం శాసనవ్యవస్థ పరిధిలోకి రావటం అవాంఛనీయం. ఏ మాత్రం సమర్ధనీయం కాదు. రాజధానిలో నిర్మాణాలు అంట..ఒక నెలలో రోడ్లు. ఆరు నెలల్లో మిగతా నిర్మాణాలు పూర్తి చేయాలి అని ఆదేశాలు ఇచ్చారు. ఇది అసలు ఏమైనా సాధ్యం అవుతుందా?. అసలు రాజధాని పూర్తి కావటానికి కనీసం 40 సంవత్సరాలు పడుతుందని అన్నారు. అభివృద్ధి అంతా ఒకే చోట జరగటం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చిందని విభజన సమయంలో వచ్చిన ఓ నివేదికలో ప్రస్తావించారని..అందుకే తాము అభివృద్ధి వికేంద్రీకరణకే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చామన్నారు.
అంతకు ముందు మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ అసెంబ్లీలో చేసిన చట్టాలు రాజ్యాంగ విరుద్ధమైతే ఆ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చని అన్నారు. కానీ కోర్టులు ప్రభుత్వాన్ని నడపలేవని స్పష్టం చేశారు. మూడు రాజధానుల విషయంలో హైకోర్టు తీర్పు సున్నితమైందన్నారు. బాధ్యతలను కట్టడిచేసే విధంగా హైకోర్టు తీర్పు ఉందన్నారు. కోర్టులంటే అందరికీ గౌరవం ఉందన్నారు. గతంలో రాజరిక వ్యవస్థ ఉండేదని, రాజు ఏం చెబితే అది నడిచేదన్నారు. అధికారం రాజు దగ్గరే కేంద్రీకృతం కావడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. అక్కడి నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. జ్యుడీషియల్ యాక్టివిజం దిశలేని మిసైల్ లాంటిదని ఆయన అభివర్ణించారు. చట్టసభలు, అధికారుల విధుల్లో కోర్టులు కలగజేసుకుంటే ఓటర్లు, రాజకీయ నాయకులు వారి విషయాన్ని సమీక్షిస్తారని ఆయన పేర్కొన్నారు.
ఇదే జరిగితే న్యాయవ్యవస్థ స్వతంత్రతను కోల్పోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. అధికార యాంత్రాంగాన్ని కోర్టు తీర్పులు చికాకు పెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించకూడదన్నారు. న్యాయవ్యవస్థతో పాటు మిగిలిన రెండు వ్యవస్థలు సమానమేనని సుప్రీంకోర్టు చెప్పిందని ఆయన గుర్తు చేశారు. చట్టాల చేసే అధికారం కేవలం శాసనవ్యవస్థకే ఉందన్నారు. రాజ్యాంగంలో ఇదే స్పష్టంగా ఉందన్నారు. విశ్లేషణలను నిపుణుల కమిటీలు చేయాలి కానీ కోర్టులు ఆ పని చేయకూడదన్నారు. కోర్టులు తమ పరిధి దాటి కార్యనిర్వాహక పనిలో జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ప్రజలకు మంచి చేయకుండా అడ్డుకుంటే నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. అసమానతలను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. దాని కోసమే కొత్త విధానాలను తీసుకొస్తుందన్నారు. విధానాల్ని మార్చే అధికారం శాసనసభకే ఉందని ఆయన స్పష్టం చేశారు.