ఏపీలో పరిషత్ ఎన్నికలు రద్దు
ఎన్నికలు పూర్తి అయి..కౌంటింగ్ దశలో ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రద్దు అయ్యాయి. ఈ మేరకు ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికలు జరగలేదని..ఈ ఎన్నికలకు మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఏప్రిల్ 8న ఏపీలో పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 1న ఎస్‌ఈసీ పోలింగ్ తేదీలు ప్రకటించింది. ఏప్రిల్ 6న పరిషత్ ఎన్నికలపై హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే ఇవ్వగా, ఏప్రిల్ 8న హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే రద్దు చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలతో ఎస్‌ఈసీ ఎన్నికలు నిర్వహించింది. శుక్రవారం నాడు పరిషత్ ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఆదేశాలపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు వెంటనే పిటీషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మామూలుగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాతే ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవు. అలాంటిది ఏకంగా ఎన్నికలు పూర్తయి...కేవలం ఫలితాలు మాత్రమే వెల్లడి కావాల్సి ఉన్న సమయంలో ఏకంగా ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకోవటం పెద్ద సంచలనంగా మారింది.